పీఎం-కేర్స్‌ ఫండ్‌ కు కార్పొరేట్ల విరాళాల వెల్లువ  

కరోనా వైరస్‌ దెబ్బకు అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు కార్పొరేట్లు ముందుకొస్తున్నారు. ఆపత్కాలంలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ప్రధాన మంత్రి-సంరక్షణ నిధి (పీఎం-కేర్స్‌ ఫండ్‌)కి ఆదివారం అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ మరో రూ.100 కోట్లను ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. 

టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్ట్స్‌ రూ.500 కోట్ల చొప్పున సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపాయి. వైరస్‌ నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత సంరక్షణార్థం, పెరుగుతున్న రోగుల శ్వాసకోశ ఇబ్బందుల చికిత్స కోసం, కొత్త కేసుల నిర్ధారణ నిమిత్తం, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.  

అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.25 కోట్లు, ఆ బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కొటక్‌ రూ.25 కోట్ల చొప్పున పీఎం-కేర్స్‌ నిధికి విరాళాలు ప్రకటించారు. అదనంగా మరో రూ.10 కోట్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఇస్తున్నది. ‘రాబోయే కొద్దివారాలు దశాబ్దాల తరబడి మానవత్వానికి ప్రతీకగా నిలవాలి. ప్రాణాలను, ప్రజలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. విజ్ఞానం, ఔషధాలు వైరస్‌ను అంతమొందిస్తే.. అంతా కలిసి చేసే ఆర్థిక సాయం సంక్షోభాన్ని నివారిస్తుంది’ అని ఉదయ్‌ ట్వీట్‌ చేశారు.

కల్యాణ్‌ జ్యుయెల్లర్స్‌ కరోనా వైరస్‌పై పోరులో భాగంగా రూ.10 కోట్ల సాయానికి ముందుకొచ్చింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో స్థానిక, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో నిరుపేదలకు ఆహార, ఇతర నిత్యావసరాలను అందిస్తామని ఓ ప్రకటనలో సంస్థ సీఎండీ టీఎస్‌ కల్యాణరామన్‌ చెప్పింది. 

కాగా, ఇప్పుడున్న పరిస్థితులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తమ 8వేల ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తామని ఈ సందర్భంగా సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ తమ 28 దవాఖానల్లో కరోనా వైరస్‌ బాధితుల కోసం ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటుచేసింది. వీటిలో 262 పడకలను సిద్ధం చేసింది.