రిటైల్‌ ఔట్‌లెట్ల వద్ద  శానిటైజర్లు, నిర్ణీత దూరం 

కరోనా వైరస్‌ భయాల మధ్య రిటైల్‌ ఔట్‌లెట్లు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాల కోసం వస్తున్న కొనుగోలుదారులను కొద్దికొద్దిగా లోనికి అనుమతిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నాయి. ప్రవేశ ద్వారం వద్ద కస్టమర్ల చేతులను శానిటైజర్స్‌తో శుభ్రం చేయించిగానీ పంపడం లేదు. 

రిలయన్స్‌ ఫ్రెష్‌, మోర్‌, వాల్‌మార్ట్‌, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఔట్‌లెట్లు.. కస్టమర్ల టెంపరేచర్‌ను సైతం చూస్తున్నాయి. జ్వరం ఉన్నైట్లెతే వెనక్కి వెళ్లిపోవాలని సిబ్బంది కోరుతున్నారు. మరికొన్ని స్టోర్లు మాస్క్‌లు లేని కస్టమర్లను లోనికి అనుమతించడం లేదు. ఇక లోనికి వెళ్లిన వారు కనీస దూరం పాటించాల్సిందే. బిగ్‌బజార్‌, డీమార్ట్‌, వాల్‌మార్ట్‌, మోర్‌, రత్నదీప్‌, ఉషోదయ సంస్థలు నిర్ణీత దూరం పాటిస్తూ ప్రత్యేక లైన్లను కస్టమర్ల కోసం నిర్వహిస్తున్నాయి.

ఏరోజుకారోజు స్టోర్లను శానిటైజర్లతో శుభ్రం చేస్తున్న రిటైలర్లు.. కస్టమర్లు ఎక్కువగా తాకే చోట్లను మరింత గట్టిగా కడిగేస్తున్నారు. చివరకు సరుకుల కోసం కస్టమర్లు పట్టుకున్న బుట్టలు, ట్రాలీలనూ నిత్యం శుభ్రపరుస్తున్నారు.

‘ఇన్ఫెక్షన్‌ రాకుండా పప్పులు, చక్కెర, పిండి తదితర పదార్థాలను ముందుగానే ప్యాకేజ్‌ చేస్తున్నాం. బిల్లింగ్‌ సమయాన్నీ తగ్గించేలా మొబైల్‌ చెకౌట్లను ఏర్పా టు చేశాం. టోకెన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాం’ అని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా తెలిపింది. స్టోర్‌లో రద్దీ ఏర్పడకుండా, ఒకరిని ఒకరు తాకకుండా చర్యలు చేపడుతున్నామని, వెయిటింగ్‌ చేస్తున్న కస్టమర్లనూ వేర్వేరుగా ఉంచుతున్నామని డీమార్ట్‌ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోన్హా పీటీఐకి తెలిపారు.

20 నుంచి 30 మందిని గ్రూపులుగా విడదీసి వారందరికీ ఓ కలర్‌ టేప్‌ను వేస్తున్నామని, ఆ కలర్‌తో పిలిచి సదరు గ్రూపును లోనికి వెళ్లనిస్తున్నామని చెప్పారు. బిల్లింగ్‌ కౌంటర్ల వద్ద కస్టమర్ల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని బిగ్‌బజార్‌ మాతృ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రతినిధి తెలిపారు.

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నిర్మూలనలో శానిటైజర్లకున్న ప్రాధాన్యం దృష్ట్యా భారత్‌ నుంచి విదేశాలకు వాటి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అన్ని రకాల వెంటిలేటర్ల ఎగుమతిపైనా నిషేధాజ్ఞలు తెచ్చింది. ఇప్పటికే సర్జికల్‌, డిస్పోజబుల్‌ మాస్క్‌లు, వీటి తయారీకి ఉపయోగించే ఉత్పత్తుల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్కెట్‌లో హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్క్‌లకు విపరీతంగా డిమాండ్‌ కనిపిస్తున్నది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కస్టమర్ల కోసం వారెంటీ గడువులను యమహా, టీవీఎస్‌ సంస్థలు పొడిగించాయి. లైఫ్‌ టైమ్‌ క్వాలిటీ కేర్‌ సౌకర్యాన్ని 60 రోజులు పొడిగిస్తున్నట్లు ఇండియా యమహా మోటార్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 15 వరకు ఉచిత సర్వీసు గడువును, జూన్‌ వరకు సాధారణ వారెంటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. 

అలాగే మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య ముగిసే వార్షిక మెయింటేనెన్స్‌ కాంట్రాక్టులనూ జూన్‌దాకా పొడిగిస్తున్నామన్నది. ఇక టీవీఎస్‌ మోటార్‌ సైతం మార్చి, ఏప్రిల్‌ మధ్య ఉంటే ఫ్రీ సర్వీస్‌ సదుపాయాన్ని జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.