కొత్త కేసులు లేమితో ఏప్రిల్ 7కి కరోనా లేని తెలంగాణ

మరో పది రోజులలో కరోనా సమస్య లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనున్నదా? అందుకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కరొనతో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది కోలుకొని, నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఆసుపత్రుల నుండి విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు వరుసగా ఆ విధంగా విడుదలయ్యే అవకాశం ఉంది. 

మరోవంక, కరోనా అనుమానంతో స్వీయ దిగ్బంధనంలో ఉన్న వారు సహితం పెద్ద సంఖ్యలో వరుసగా బైటకు వస్తున్నారు. ఇవ్వన్ని సానుకూలంగా జరిగితే, కొత్తగా కరోనా కేసులు రాని పక్షంలో ఏప్రిల్ 7 నాటికి కరోనా లేని రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కరొనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ  చికిత్స తీసుకుని కోలుకున్న ఒక వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు మన్ కి బాత్ లో మాట్లాడారని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తామని చెప్పారు. తెలంగాణలో కరోనాతో మొదటగా మృతి చెందిన 76 ఏళ్ల వ్యక్తికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయని చెబుతూ, ఆయన ఒక్కడు తప్పించి మిగతా వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి పంపించే ముందు పక్కాగా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటామని స్పష్టం చేశారు. 

క్వారంటైన్‌లో ఉన్న 27, 937 మందిపై నిఘా ఉందని చెబుతూ వారిని రోజుకి రెండు సార్లు డాక్ట‌ర్లు ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పారు. కొత్త కేసులు లేక‌పోతే పరిశీలనలో ఉన్న అనుమానితుల సంఖ్య జీరో కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

వైద్య మౌలిక సదుపాయాలు ఎక్కువగా లేని భారత్ వంటి దేశంలో కరోనా ను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌ ప్రకటించడంపై ప్రపంచంలోని నిపుణులు ప్రశంసిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. సీరియస్‌గా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతూ రాకపోకలు ఆగిపోవడంతో బైట దేశాల నుండి కొత్తగా కేసులు వచ్చే అవకాశం లేదని తెలిపారు. వ్యాధికి మందులేక పోవడంతో స్వీయ నియంత్రణ మాత్రమే మన ఆయుధమని స్పష్టం చేశారు.