హెల్త్ కేర్‌ వర్కర్ల కోసం ఫేస్ షీల్డ్స్ 

కోవిడ్-19 సోకిన వారికి ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది కోసం ప్రత్యేకమైన ఫేస్ షీల్డ్స్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఫ్యాకల్టీ తయారుచేసింది. ఐఐటి ఖర‌గ్‌పూర్‌లోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ప్రొఫెసర్ సంతను ధారా, ప్రొఫెసర్ సంగీత దాస్ భట్టాచార్య కలసి ఇంటిలోనే ఫేస్ షీల్డ్‌ల‌ను తయారుచేసే నమూనాను రూపొందించారు.

 పర్సనల్ ప్రొటేక్టివ్ ఈక్విపిమెంట్ (పీపీఈ) అనేది ఆరోగ్య సిబ్బందికి తప్పనిసరిగా అవసరం. దేశంలో ప్రస్తుత పరిస్థితులలో ఫేస్‌మాస్క్‌ కొరత ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో,  లేదా పరిసరాలలో దొరికే వ‌స్తువుల‌తో దీన్ని తయారుచేసుకునే న‌మూనాను ఐఐటీకే బృందం రూపొందించింది.

ఈ ఫేస్ షీల్డ్స్ తయారీకి ట్రాన్సఫరెన్సీ షీట్, స్పాంజ్, మడతపెట్టిన కాగితం, కార్డ్‌బోర్డు లేదా ప్యాకేజింగ్ బాక్స్, సాగే లేదా రబ్బరు బ్యాండ్, డబుల్ సైడెడ్ టేప్ ఉన్నాయి. ఐఐటీకు చెందిన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం రెండు గంటల్లో ఇటువంటి 14 ముఖ కవచాలను ఉత్పత్తి చేసింది. 

ముఖకవచాల గురించి ప్రొఫెసర్ ధారా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వీటికి చాలా డిమాండ్ ఉందని, అయితే వీటిని సులభంగా ఇంటివద్దే తయారుచేసుకునేలా నమూనా తయారు చేశామని పేర్కొన్నారు. పేషంట్లకు సేవలు అందించే సిబ్బంది సురక్షితంగా ఉండేలా వీటిని రూపొందించామని ఆయన తెలిపారు. 

"ఆరోగ్య సంరక్షణ కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించడం చాలా అవసరం. ఫేస్ షీల్డ్ కేవలం ఒక భాగం. మేము ఒక చిన్న మార్గంలో వీరికి సహకరిస్తున్నాము, వీటిని పూర్తిస్థాయిలో పరీక్షించలేదు" అని ప్రొఫెసర్ భట్టాచార్య తెలిపారు.

ఆరోగ్యసిబ్బందికి ముఖ క‌వ‌చాలు, కంటికి రక్షణ ఇచ్చే గూగుల్స్, గ్లవ్సెస్, గౌన్స్, తలకు రక్షణ అందించే ఎలాస్టిక్ హెడ్గేర్లు చాలా అవసరం. అయితే ప్రస్తత పరిస్థితులలో ప్రపంచ వ్యాప్తంగా వీటికొరత ఉంది.