కరోనా వెనుక చైనా కుట్ర అంటున్న భారతీయులు 

నేడు ప్రపంచం అంతటిని కకావికలం కావిస్తున్న కోవిడ్ -19 మహమ్మారి వ్యాపించడం వెనుక ఈ వైరస్ ఆవిర్భావానికి మూలమైన చైనా కుట్ర దాగి ఉన్నదని దాదాపు సగం మంది భారతీయులు అనుమానిస్తున్నారు. కాగా, అత్యధికంగా ప్రజలు కరోనా కట్టడి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

దేశ వ్యాప్తంగా టెలిఫోన్ ద్వారా జన్ కి బాత్ జరిపిన సర్వే ఫలితాలను స్వరాజ్య పత్రిక ప్రకటించింది. ఆ పత్రిక కధనం ప్రకారం 47 శాతం మంది ప్రజలు ఈ వైరస్ వెనుక చైనా కుట్ర దాగిఉన్నట్లు భావిస్తున్నారు. అయితే అది చైనా పొరపాటు అని 27 శాతం మంది, పకృతి వైపరీత్యం అని మరో 27 శాతం మంది భావిస్తున్నారు. 

ఈ నెల 18 నుండి 24 వరకు 2,000 మందిని సంప్రదించి ఈ సర్వేను జరిపారు. భారత దేశపు భౌగోలిక, జనాభా వైవిధ్యానికి తాము సర్వే కోసం ఎంపిక చేసుకున్న వారు ప్రతిబింబిస్తారని సర్వే నిర్వాహకులు తెలిపారు. 

దేశ వ్యాప్తంగా సిటిజన్ రిపోర్టర్ తరహాలో ఈ సర్వే జరిపినట్లు జన్ కి బాత్ సిఇఓ పాడిట్ భండారి పేర్కొన్నారు. 18 నుండి 40, 40 నుండి 65, 65 ఆ పైన వయస్సు గలవారిని మూడు వర్గాలుగా ఎంపిక చేశామని చెప్పారు. 

కాగా, 81 శాతం మంది ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతు తెలిపారు. వారిలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు, అన్ని వయస్సుల వారు ఉన్నారు. దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్ విధించాలని ప్రధాని మోదీ నిర్ణయాన్ని కూడా వారు సమర్ధించారు.  పైగా, లాక్ డౌన్ ను కఠినంగా అమలు జరుపాలని కూడా కోరుతున్నారు. 

కాగా, తాము ప్రతి రోజు సబ్బులు/ శానిటైజర్లను వాడుతున్నామని, ఇంటికి పరిమితమై ఉంటున్నామని కేవలం 42 శాతం మంది మాత్రమే చెప్పారు. తాము క్రమంగా చేతులను కడుకొంటునప్పటికీ, అప్పుడప్పుడు బైటకు కూడా వెడుతున్నామని 38 శాతం చెప్పారు. వీరందరిలో 52 శాతం మంది శానిటైజర్ కన్నా సబ్బు వాడకం పట్లనే మొగ్గు చూపుతున్నారు. కేవలం 15 శాతం మంది మాత్రమే రెండింటిని ఉపయోగిస్తున్నారు. బైటకు వెడుతున్నవారు శానిటైజర్లను వాడుతున్నారు. 

అత్యధికంగా, 83 శాతం మంది తమకు కోవిడ్-19 లక్షణాల గురించి తెలుసని తెలపడం సంతోషింపదగిన అంశం. పెద్ద ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా సాగిస్తున్న అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడి చేస్తుంది. 

అత్యధికంగా ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పొందుతున్నట్లు చెప్పారు. 36 శాతం మంది, ఎక్కువగా వృద్దులు టివి ద్వారా, 10 శాతం మంది ప్రింట్ మీడియా ద్వారా తెలుసుకొంటున్నారు. కాగా, 56 శాతం మంది ప్రజలకు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత దేశంలో నెలకొన్న వైద్య మౌలిక సదుపాయాల పట్ల తమకు శ్వాసం లేదని స్పష్టం చేస్తున్నారు. 

ఈ వైరస్ వ్యాప్తిని త్వరలో కట్టడి చేయలేని పక్షంలో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి 65 శాతం మంది ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా తమ ఉపాధి, ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతుందని కూడా భయపడుతున్నారు. ఆర్ధకంగా తమపై ప్రభావం చూపబోదని కేవలం 4 శాతం మంది మాత్రమే చెప్పారు. ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని 61 శాతం మంది, తమ వినియోగ సామర్ధ్యం తగ్గిపోతుందని 35 శాతం మంది తెలిపారు.