వలస కార్మికుల కోసం రంగంలోకి కేంద్రం 

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కార్మికుల కోసం తక్షణమే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. వారికి తాత్కాలిక వసతి, భోజన సదుపాయం కల్పించడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది.  

ఇందుకోసం ఎస్డీఆర్‌ఎఫ్‌ (రాష్ట్ర విపత్తు సహాయ నిధి) నిధులను వాడుకోవచ్చని తెలిపింది. ఈ నిధుల పరిధిలో మొత్తం రూ 29,000 కోట్లు ఉంటాయి. 21 రోజుల కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న కార్మికులు, వలసకూలీలకు ఆహారం, తాత్కాలిక నివాసం కల్పిస్తారు. ఈ నిధుల డబ్బులను ఇందుకోసం వినియోగిస్తారు. 

లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. రవాణా సేవలు నిలిచిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు కాలినడక సాగించి స్వస్థలాలకు వెళ్తున్నారు.

వలస కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. 

వలస కార్మికులకు భోజనం, నీరు అందించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధిపతి, టోల్‌ ఆపరేటర్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ కోరారు. 

ఇలా ఉండగా, చిక్కుపడ్డ వలసకార్మికుల తరలింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేయి బస్సులను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కూలీలు, వలసకార్మికులు ఉపాధి కోల్పొయ్యారు. దీనితో వారు తమ ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతున్నారు. దీనితో రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆంక్షలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. నోయిడా, గజియాబాద్, బులంద్‌షహర్, అలీగఢ్ వంటి పలు ప్రాంతాలలో కూలీలు ఎటువెళ్లలేని స్థితిలో రోడ్డున పడ్డారు.

వీరి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఉన్నతస్థాయిలో సమీక్షించి బస్సుల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. దీనితో  శనివారం ఉదయం లక్నోలోని ఛార్‌బాగ్ బసు స్టేషన్‌కు సీనియర్ పోలీసు అధికారులు తరలివచ్చారు. ఇక్కడి నుంచి కూలీల బస్సు ప్రయాణానికి తగు విధంగా ఏర్పాట్లు చేశారు. 

వారికి ఆహారం, మంచినీరు అందేలా చేశారు. లక్నో నుంచి బయలుదేరిన బస్సులు కాన్పూర్, బలియా, వారణాసి, గోరఖ్‌పూర్; ఫైజాబాద్ ఇతర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. అక్కడున్న వారిని తీసుకుని వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి.