సామాజిక వ్యాప్తి  చెందిన్నట్లు ఆధారాలు లేవు 

భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి సామాజిక వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పడానికి తగిన ఆధారాలు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఎపిడమియాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధిపతి రామన్ ఆర్ గంగా ఖేడ్కర్ స్పష్టం చేశారు. 

తాము తాజాగా సివియర్ యాక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ (ఎస్ఏఆర్ఐ) కేసులను పరీక్షించడం ప్రారంభించామని చెప్పారు. కొన్ని చెదురు మదురు కేసుల్లో రోగుల వైద్య చరిత్రను పరిశీలించినపుడు, వారికి ఆ వ్యాధి ఏ విధంగా సోకిందో తెలియజేసే ఆధారాలు కనిపించలేదని పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని చెప్పడానికి తగిన స్థాయిలో ఈ కేసుల సంఖ్య లేదని కూడా స్పష్టం చేశారు.

బిహార్‌లో కొన్ని కరోనా వైరస్ పాజిటివ్ కేసులను పరిశీలించినపుడు, వారికి ఆ వ్యాధి ఏ విధంగా సోకిందో తెలిపే ఆధారాలు కనిపించలేదని చెబుతూ దీంతో దేశంలో కోవిడ్-19 మహమ్మారి సామాజిక వ్యాప్తి చెందుతోందనే భయాందోళన నెలకొందని తెలిపారు. 

సామజిక వ్యాప్తి అంటే ఏదైనా వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఇతరులకు వ్యాపించడం, లేదా, రోగులు, ఇతరులు కలిసిన దాఖలాలు కనిపించకుండా, ఇతరులకు అంటుకోవడం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి వ్యాప్తికి కారణమైన సంబంధాన్ని గుర్తించడం కష్టమవుతుంది.

ఐసీఎంఆర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం కరోనా వైరస్ పరీక్షల కోసం అనుసరించే విధానాన్ని ఈ సంస్థ మార్చింది. అక్కడక్కడ కొందరు రోగులను పరీక్షించడానికి బదులుగా, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులందరినీ పరీక్షించడం ప్రారంభించింది. 

కోవిడ్-19 మహమ్మారి దేశంలో సామాజిక వ్యాప్తి చెందుతోందని కొందరు భయాలు వ్యక్తం చేయడానికి ఐసీఎంఆర్ తీసుకున్న ఈ నిర్ణయమే కారణం. దీని గురించి భయపడవలసిందేమీ లేదని గంగా ఖేడ్కర్ చెప్పారు. వ్యక్తులు తమ వివరాలను గుర్తు పెట్టుకోవడంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. 

కొందరు తాము ఎవరెవరిని కలిశామో చెప్పడానికి ఇష్టపడరని, కొందరు కావాలనే ఆ వివరాలను దాచిపెడతారని చెప్పారు. తాము కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైందనే విషయాన్ని సైతం కొందరు రహస్యంగా ఉంచుతారని పేర్కొన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరుగుతున్నట్లు చెప్పగలిగే సంఖ్యలో కేసులు వచ్చే వరకు, ఏ విషయాన్నీ మితిమీరి మాట్లాడకూడదని హెచ్చరించారు. 

మరోవైపు ప్రభుత్వం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తోంది. వైద్య సంబంధ సదుపాయాలను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.