కరోనా జన్యుక్రమంపై సీసీఎంబీ పరిశోధన

భారత్‌ సహా ప్రపంచదేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొనడానికి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌, మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) సిద్ధమవుతున్నది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 500 నుంచి 600 నమూనాలను సేకరించనున్నది. 

చైనాలోని వుహాన్‌లో పుట్టిన వైరస్‌కు, ఇటలీ, ఇరాన్‌, అమెరికాలో విస్తరించిన వైరస్‌కు, భారత్‌లో వ్యాపిస్తున్న వైరస్‌కు జన్యుక్రమంలో తేడాలున్నాయేమో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఆయా దేశాల భౌగోళిక స్థితి, వాతావరణ తీరును బట్టి వైరస్‌లో మార్పులొచ్చేందుకు ఏమైనా ఆస్కారముందా అన్న విషయాలను నిర్ధారించడానికి సీసీఎంబీ సిద్ధమవుతున్నది.

తన పరిశోధనల కోసం పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజి, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)లతో సమన్వయం చేసుకోనున్నది. జీవశాస్త్ర పరిశోధనల్లో సీసీఎంబీ ఇప్పటికే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. తమ వద్దనున్న హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ యంత్రం ద్వారా జన్యుపరిణామక్రమాన్ని గుర్తించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. 

దేశవ్యాప్తంగా 600 వరకు నమూనాలను సేకరించి, త్వరలోనే తమ పరిశోధన ప్రారంభిస్తామన పేర్కొన్నారు. ఇప్పటికే చైనా నుంచి అమెరికా వరకు అన్ని దేశాలలో కొవిడ్‌-19 జన్యుక్రమాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా టెస్టింగ్‌ కిట్‌ల తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు సీసీఎంబీ సహకరిస్తుందని తెలిపారు. 

మరోవంక, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడంతో తమ వద్ద కరోనా పరీక్షలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. అయితే అందుకు అవసరమైన కిట్ లను సమకూర్చుకోవలసి ఉన్నాడని ఉన్నట్లు చెప్పారు. ఒకేసారి వెయ్యిమందికి వరకు పరీక్షా జరుపగలమని పేర్కొన్నారు.