కేంద్రం గ్రాంట్ లపై నిజం చెప్పి చెంపలేసుకో బాబు !

కేంద్రం నిధులివ్వకుండా రాష్ట్రానికి ఎంతోద్రోహం చేసిందని దొంగ ధర్మపోరాట దీక్షలో సమావేశాలు పెట్టి గగ్గోలు పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, రాష్ట్రంలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రతివారం కన్నా ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

2017-18 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రూ.9,700 కోట్ల గ్రాంట్ లక్ష్యంగా పెట్టుకోగా రూ.17,500 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేవలం ఆరునెలలకే రూ.10,372 కోట్ల గ్రాంట్ వచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ప్రజలకు నిజం చెప్పి చెంపలు వేసుకోవాలని ముఖ్యమంత్రికి కన్నా సూచించారు.

రెండవ ప్రశ్నగా రాష్ట్రంలో, జిల్లాల్లో మట్టి ఇసుక గనులు దేనినీ వదలకుండా చంద్రబాబు కుమారుడు లోక్‌ష్ కనుసన్నల్లో కబ్జా అయిపోతున్నాయని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మూలపేట నుండి కాకరపల్లె వరకు సముద్రతీరాన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉప్పుశాఖ వారి వేలాది ఎకరాలు తెలుగుదేశం నాయకులు కబ్జా చేయలేదా, దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.

మూడవ ప్రశ్నగా చైనాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి వెళ్లేందుకు మీ కుమారుడికి ఎంత ఖర్చయింది. అంతా రాష్టమ్రే ఎందుకు భరించాల్సి వచ్చిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీకి జూలై 6న జివోనెం.64 ద్వారా రూ.18 కోట్లు కేటాయించి, మరలా ఆ సంస్థ ద్వారా చైనా ఖర్చులకు సెప్టెంబర్ 6వ తేదీ జీవో 1947 ద్వారా భరించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

నాల్గవ ప్రశ్నగా పులిచింతల కాంట్రాక్టర్‌కు లబ్ది చేకూర్చేందుకు విజయవాడలో స్వరాజ్ మైదానాన్ని మీకు కావాల్సిన బొళ్లినేని శీనయ్య కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కోర్టులో సవాల్ చేయని విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పులిచింతల కాంట్రాక్టర్ తాము అదనంగా రూ.199 కోట్ల పనులు చేశానని ప్రభుత్వం, దానికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని కోర్టుకు వెళ్లగా సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో ఆ వ్యయం రూ.400 కోట్లకు చేరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఆ డబ్బు సకాలంలో చెల్లించనందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానం, పులిచింతల కోసం సేకరించిన 48 ఎకరాల భూమిని వేలం వేసి కాంట్రాక్టర్‌కు డబ్బు చెల్లించాలని మచిలీపట్నం కోర్టు ఆదేశాలు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు.

ఐదవ ప్రశ్నగా అమెరికాలో ప్రకృతి వ్యవసాయంపై మీ ప్రసంగంలో రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పారని, అయితే వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీలో 2018-19 వ్యవసాయ బడ్జెట్‌లో ప్రసంగిస్తూ ఇప్పటి వరకు 1.63 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారని గుర్తు చేసారు. ఇందులో ఏది వాస్తవమో ప్రజలకు వివరించాలని కన్నా డిమాండ్ చేశారు.