కరోనా నియంత్ర‌ణ‌లో ఆయుష్ కీలక పాత్ర 

కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో ఆయుష్ విభాగం ప్రాముఖ్య‌త పెరిగింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.కరోనావైరస్ వ్యాప్తిని నిలువరించడంలో ఈ రంగానికి చెందిన నిపుణులు కీలకపాత్ర పోషించాలని పిలపునిచ్చారు.  

ఆయుష్ వైద్య ప్ర‌తినిధుల‌తో ఇవాళ ప్ర‌ధాని మోదీ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఆయుర్వేద‌, యోగా, యునాని, సిద్ధ‌, హోమియోప‌తి ప్రొఫెష‌న‌ల్స్‌తో ఆయ‌న మాట్లాడారు.  క‌రోనా వైర‌స్ గురించి మోదీ .. ఆయా వైద్య ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించారు.  దేశాన్నిఆరోగ్యం ఉంచే సంప్ర‌దాయం ఆయుష్‌కు ఉంద‌ని గుర్తు చేశారు. 

 ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచ‌న‌ల మేర‌కు ఆయుష్ ప్ర‌తినిధులు ప‌ని చేయాల‌ని మోదీ సూచించారు. విప‌త్క‌ర స‌మ‌యంలో వత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు తీసువాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను యోగా మినిస్ట్రీ చెబుతోంద‌ని పేర్కొన్నారు.   

ఆయుష్ వైద్య నిపుణులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారనీ.. ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం తమకు అత్యవసరమని తెలిపారు. లాక్‌డౌప్ సందర్భంగా మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇంటి వద్దనే యోగా సాధన చేసేలా పోత్సహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు.  

కొవిడ్-19 సవాలును ఎదుర్కోవటానికి దేశంలోని మొత్తం ఆరోగ్య రంగ నిపుణుల సేవలను ఉపయోగించునేందుకు సిద్ధంగా ఉండాలనీ చెప్పారు. అవసరమైతే ఆయుష్‌కు ప్రైవేట్ వైద్యుల నుంచి సహాయం అందేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. 

ఆయుష్‌తో లింకున్న ప్రైవేటు డాక్ట‌ర్లు కూడా ఈ పోరులో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపిచ్చారు. ఆయుష్ మందులు త‌యారు చేసే సంస్థ‌లు.. శానిటైజ‌ర్లు కూడా ఉత్ప‌త్తి చేయాల‌ని ప్రధాని కోరారు. సామాజిక దూరం గురించి కూడా చైత‌న్య‌ప‌ర‌చాల‌ని చెప్పారు.  

కోవిడ్‌19పై ప్ర‌ధాని మోదీ చేస్తున్న పోరును కూడా ఆయుష్ వైద్యాధికారులు మెచ్చుకున్నారు.  రేడియో జాకీల‌తో కూడా మోదీ ఇలాంటి విష‌యాల‌నే చ‌ర్చించారు.  కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపద్ నాయక్‌తో పాటు ఆయుష్ శాఖ క్యాబినెట్ కార్యదర్శి రాజేష్ కోటేచా తదితరులు కూడా పాల్గొన్నారు.