కరోనా పోరుకై టాటా ట్రస్ట్ రూ.500  కోట్లు 

వ్యాపార దిగ్గజం టాటా ట్రస్ట్‌ సంస్థ కరోనా పోరుకై రూ.500 వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ట్విటర్‌లో ప్రకటన విడుదల చేశారు.

 ‘యావత్‌ ప్రపంచం, భారత్‌ కోవిద్-19తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీన్నుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతీ గంటా ఎంతో విలువైనది. జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందున్న కష్టతరమైన సవాలు ఇది. టాటా ట్రస్ట్‌ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోంది. వైరస్‌ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికి, బాధితులకు సాయం కోసం రూ.500 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం’ అని రతన్‌ టాటా తెలిపారు. 

వైరస్‌ బాధితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్‌ పరీక్షలకు టెస్టింగ్‌ కిట్లు, ప్రజలకు వైరస్‌పై అవగాహన కార్యక్రమాలకు ఈ మొత్తం  ఖర్చు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 

వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్‌, టాటా సన్స్‌, టాటా గ్రూప్‌ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.  ప్రాణాలను పణంగా పెట్టి మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

ఇలా ఉండగా, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ నెల వేతనాన్ని కేంద్ర సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి, కోవిడ్‌-19పై కేంద్ర ప్రభుత్వ పోరాటానికి మద్దతుగా తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నట్లు నడ్డా ప్రకటించారు. బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. కోటి విరాళంగా అందజేయనున్నట్లు చెప్పారు.