కనికాకపూర్‌కు మూడోసారి కరోనా పాజిటివ్  

విదేశాల నుండి వచ్చి, కరోనా టెస్ట్ చేయించుకోకుండా తిరుగుతూ లక్నోలో సంపన్నుల దావత్ కు హాజరై కలకలం రేపిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ కు వరుసగా మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 

ప్రస్తుతం లక్నోలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమెను దావత్ లో కలిసిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా పరీక్ష చేయించుకొని, రెండు వారల పాటు స్వీయదిగ్బంధనంకు వెళ్లడం తెలిసిందే. 

క‌రోనా విస్త‌రిస్తున్న సమయంలో బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై లక్నో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో సహితం ఆమె వైద్య బృందంతో వాదులటలకు దిగుతూ ఉండడంతో ఆమె ఒక సెలెబ్రెటీ వలే కాకుకండా, రోగి వలే వ్యవహరిస్తూ తమకు సహకరించాలని అంటూ వైద్యులు అసహనం కూడా వ్యక్తం చేశారు. దానితో తననే వైద్యులు వేధిస్తున్నారని అంటూ ఆమె ఎదురు దాడికి దిగారు. 

లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్దారించారు.

ఆమెతో స‌న్నిహితంగా ఉన్న‌వారంద‌రి వివ‌రాల‌ను సేక‌రించారు. వారంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 63మందికి నెగెటివ్ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు.