విజయవాడ, విశాఖ, గుంటూరులపై ప్రత్యేక దృష్టి 

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే ప్రయత్నంలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరుపుతూ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

అయితే,  14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారికి మాత్రమే ఏపీలోకి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. సరిహద్దులలో వారికోసం ఏర్పాటుచేసిన శిబిరాల పర్యవేక్షణకు కచ్చితంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. రిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా అధికారి మాట్లాడాలని చెప్పారు. 

సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు.. హోటళ్లను గుర్తించి శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలని, టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచడంపై కూడా దృష్టి పెట్టాలని వివరించారు. 

నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి వాయిదా వేశారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ఉన్నాయా లేదా చూడాలని సీఎం సూచించారు. 

శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేయాలని, ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయం తగ్గించే ఆలోచనలు చేయాలని స్పష్టం చేశారు.   

కాగా, ఆంధ్ర ప్రదేశ్ లో శనివారం కారొనావైరస్ పాజిటివ్ కేసు కొత్తగా నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం 13 మంది మాత్రమే పాజిటివ్ నమోదయ్యాయి. 

మరోవంక, కరోనా వైరస్ రోగి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని, గోప్యత కలిగిన సమాచారం వెల్లడించడం నిషేధమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కరోనా వైరస్ రోగి వివరాలు. వైద్య పరీక్షల వివరాలు వెల్లడిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.  

ఇలా ఉండగా,  విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు తాత్కాలికంగా నిలిపి వేయాలని పోలీసులు నిర్ణయించారు. సచివాలయం, హైకోర్టులలో పని చేస్తున్న ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి పై నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.