బీజేపీ మ్యానిఫెస్టోను చూసి వణికిపోతున్న కెసిఆర్

బీజేపీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి పేదకు ఇల్లు కట్టిస్తాం, కట్టించే వరకు కిరాయి కడుతాం అని బిజెపి తెలంగాణ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వబోవడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వణికి పోతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. “నాకయితే అర్థమే కాలే.. లక్ష్మణ్ ఎవని కిరాయి కడుతాడో ఎం కడుతాడో” అంటూ కెసిఆర్ నిజామాబాదు బహిరంగ సభలో అవాకులు చవాకులు పేలడం ఆయనలోని అబద్రతా భావాన్ని వెల్లడి చేస్తున్నదని పేర్కొన్నారు.

బీజేపీ అనే ఓ పార్టీ ఉన్నది, అది యాడున్నదో ఎవనికి తలవదు అని కెసిఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఇది కెసిఆర్ అహంకారానికి పరాకాష్ట అని ద్వజమెత్తారు. బీజేపీ యాడలేకపోతే ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులకు  పొర్లుదండాలు ఎందుకు పెడుతున్నావ్? బీజేపీ యాడలేకపోతే బీజేపీ అంటే నీకెందుకు అంత వణుకు పుడుతుంది? అని ప్రశ్నించారు.

బిజెపి హామీలు కెసిఆర్ కు అర్ధం కాకపోవచ్చు గాని ఈ రాష్ట్రంలోని ప్రతి పేదకు అర్ధమయింది. ప్రతి పేదకు అర్ధమయిందని స్పష్టం చేసారు. అయినా, 50 గదుల విశాలమైన ప్రగతి భవన్ లో ఉండే నీకేం తెలుస్తుంది ఇల్లు లేని పేదల బాధ? అని కెసిఆర్ ను నిలదీశారు. ప్రతి పేదకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అని పెదాలను మోసం చేసిన మీకు ఎం తెలుస్తుంది వారి బాధ అని ఎద్దేవా చేసారు.   

కిరాయి కట్టడం సాధ్యం కాదు అని కెసిఆర్ గారు ఎలా మాట్లాడుతున్నారని అడిగారు. ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రూ 25 వేల రాజకీయ అవినీతి జరుగుతుందని, రాజకీయ నేతలు స్వాహా చేస్తున్నారని అంటూ తాము అధికారంలోకి వస్తే ఆ రాజకీయ అవినీతిని నిర్మూలిస్తాం మని స్పష్తం చేసారు. రాజకీయ అవినీతిని నిర్మూలిస్తే ఇలాంటి స్కీం లు ఇంకా పది అమలు చేయొచ్చని అంటూ రాబోయే కొద్దీ రోజుల్లో ఇలాంటి మరిన్ని హామీలతో బీజేపీ ప్రజల ముందుకు వస్తుందని రాకేశ్ రెడ్డి తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ స్కీం అని ఎందుకు కెసిఆర్ గారికి అంత ఆశ్చర్యం ఎందుకని అడిగారు. ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టే బీజేపీ ఈ అంశాన్ని ప్రజల ముందు పెట్టిందని అంటూ  పేద ప్రజల నుండి వచ్చిన స్పందనను చూసి కెసిఆర్ ఓర్వలేకే పోతున్నారని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలో ఉన్ననాడు ఎం చేయలేదు అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పేర్కొనడం పట్ల ద్వజమెత్తారు. “.మేము అధికారంలోకి వచ్చాక రాజకీయ అవినీతిని తగ్గించినాం. నీలా స్కీమ్లు పెట్టి స్కాం లు చేయలేదు. నీలా కుటుంబ రాజకీయాలు చేయలేదు. దేశంలో రాజకీయ అవినీతిని తగ్గించినం. ఆ డబ్బులతో  పేదలకు ఉచితంగా 32 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు, 15 కోట్ల మందికి చౌక ధరలో భీమా, కోట్ల మందికి ఇల్లు, మరుగుదొడ్లు, వంట గ్యాస్ లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం” అని వివరించారు.

“మేము వచ్చాకనే విద్యుత్తు సమస్యను పరిష్కరించాం, యూరియా సమస్యను పరిష్కరించాం, రుణ సమస్యను పరిష్కరించాం. ఇలా మేము వచ్చాక ఏమేం చేసామో 100 చెబుతాం.. మీరు చిత్తశుద్ధితో చేసినవి 10 అయినా చెప్పండి” అంటూ సవాల్ చేసారు.

చెప్పటోనికి చెవిటి అయినా వినటానికి ఇజ్జతి ఉండాలి అని కెసిఆర్ పేర్కొనడాన్ని ప్రశ్నిస్తూ  “అవును నువ్వు చెప్పిన దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు రెండు గదుల ఇల్లు, యువతకు ఇంటికో ఉద్యోగం అనే హామీలు విని ఓట్లు వేసిన ప్రజలకు యుజ్జతి లేదనా  నీ అభిప్రాయం?” అంటూ ఎండగట్టారు. ప్రజలు విజ్ఞులు . ప్రజలను కించపరిచే నీ అహంకారాన్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో అణిచివేస్తారని హెచ్చరించారు.