15 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు జరపాల్సిందే  

గత రెండు నెలల్లో విదేశాల నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి కోవిద్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 18 నుంచి మార్చి 23 వరకు విదేశాల నుంచి మన దేశానికి 15 లక్షల మంది వచ్చారని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా తెలిపారు. 

 సంఖ్యకు, ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నవారికి మధ్య అంతరం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిని తక్షణమే గుర్తించి ‘కోవిడ్‌’ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖల్లో ఆదేశించారు. 

కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ 15 లక్షల మందిపై గట్టి నిఘా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.  కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడి వ్యక్తులు.. అక్కడే ఉండాలనే ఉద్దేశంతోనే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఎక్కడి వ్యక్తులు.. అక్కడే ఉంటే సురక్షితంగా ఉంటారని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరినట్టు తెలిపింది. 

దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరినట్టు ప్రకటించింది. మరోవంక, మూడు వారాల లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 

పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల భారీ వలసలను అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. 

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉచితంగా ఆహారం అందేలా చూడాలని కోరింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, అద్దె వసతి గృహాలకు నిత్యావసరాలు అందేలా చూడాలని సూచించింది. విద్యార్థులు, వర్కింగ్ వుమెన్‌కి నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది.