రేటింగ్స్‌లో మోదీ ‘లాక్‌ డౌన్’ ప్రసంగం రికార్డు 

కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్త ‘లాక్‌ డౌన్’ ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం మొదట్లో చేసిన ప్రసంగం టెలివిజన్ రేటింగ్స్ లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 3,891 మిలియన్ నిమిషాలు మోదీ లాక్‌డౌన్ ప్రసంగాన్నివీక్షకులు వీక్షించినట్లు టెలివిజన్ రేటింగ్ సంస్థ బార్క్ (బీఏఆర్‌సీ) ఇండియా వెల్లడించింది. 

అంతేకాదు, ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు ప్రసంగం కంటే ఎక్కువ మంది లాక్‌డౌన్ ప్రసంగాన్ని టెలివిజన్లలో వీక్షించినట్లు బార్క్ తెలిపింది. కరోనా కట్టడికి 21 రోజులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు లాక్‌డౌన్ పాటించాలని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాన్ని 19.7 కోట్ల మంది టెలివిజన్లలో వీక్షించినట్లు బార్క్ స్పష్టం చేసింది.

మోదీ గత ప్రసంగాలైన ‘పెద్ద నోట్ల రద్దు’ ప్రసంగం, ‘జనతా కర్ఫ్యూ’ ప్రసంగాల కంటే ఇది ఎక్కువని వెల్లడించింది. ఇక్కడ మరో ఆసక్తిర విషయం ఏంటంటే... ఐపీఎల్ ఫైనల్‌ వీక్షకుల సంఖ్య కంటే ప్రధాని ‘లాక్‌డౌన్’ వీక్షకుల సంఖ్యే ఎక్కువని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ ట్వీట్ చేశారు. మొత్తం 201 ఛానళ్లు మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేశాయని ఆయన తెలిపారు. 

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 13.3 కోట్ల మంది వీక్షిస్తే.. మోదీ ‘లాక్‌డౌన్’ ప్రసంగాన్ని 19.7 కోట్ల మంది వీక్షించారు. ‘జనతా కర్ఫ్యూ’ ప్రసంగాన్ని 191 ఛానళ్లు ప్రసారం చేయగా, 8.30 కోట్ల మంది వీక్షించినట్లు బార్క్ వెల్లడించింది. 

మోదీ గత ప్రసంగాల్లో ఆగస్ట్ 8, 2019న వెలువడిన ‘ఆర్టికల్ 370 రద్దు’ ప్రసంగాన్ని 163 ఛానళ్లు ప్రసారం చేయగా, 6.5 కోట్ల మంది వీక్షించినట్లు తెలిపింది. 2016, నవంబర్ 8న ప్రకటించిన ప్రధాని ‘పెద్ద నోట్ల రద్దు’ ప్రసంగాన్ని 114 ఛానళ్లు ప్రసారం చేయగా, 5.7 కోట్ల మంది ప్రజలు వీక్షించినట్లు బార్క్ గణాంకాలు స్పష్టం చేశాయి.