లక్ష కేసులు దాటిన అగ్రరాజ్యం అమెరికా  

కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా ఉక్కిరి, బిక్కరి అవుతున్నది.  గంటగంటకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.  ఇటలీ, చైనాలను దాటేసింది.  ఇప్పటి వరకు 104,205 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత 86,498 కేసులతో  ద్వితీయ స్థానంలో ఇటలీ ఉంది.  ఆ తర్వాతి స్థానాల్లో చైనా 81,394, స్పెయిన్ 65,719, జెర్మనీ 50,871 కేసులతో ఉన్నాయి.

ఇక కరోనా మరణాల కేసులో ఇటలీ 9,134 మరణాలతో అగ్రస్థానంలో ఉంది.  ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది మృతి చెందారు. ఆ  తర్వాత స్పెయిన్ లో 5,138 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా 3295, ఇరాన్ 2378 , ఫ్రాన్స్ 1995, అమెరికా 1701 మరణాలతో ఉన్నాయి. భారత్ లో 887 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 20 మంది మృతి చెందారు. 

ప్రపంచవ్యాప్తంగా  6 లక్షలకు (5,97,267 కేసులు)  చేరువలో  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కేసులు విపరీతంగా పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక కారణం కాగా, మరోవంక జనం వినిపించుకోవడం లేదని తెలుస్తున్నది. పలు రాష్ట్రాలలో లాక్​డౌన్లు ప్రకటించినా జనాలు వినిపించుకోలేదు. 

 మిచిగన్‌లో వారం క్రితం 350గా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 3 వేలకు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 468 మంది పోలీసులు అధికారులు క్వారంటైన్‌లో ఉన్నట్టు డెట్రాయిట్ మేయర్ మైక్ డగ్గన్ తెలిపారు. పోలీస్ చీఫ్ సహా 39 మంది పోలీసులు అధికారులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.

కరోనా కేసులు పెరుగుతున్నా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం ఏమీ కాదంటూ మాటలుచెబుతూ కనీస చర్యలు తీసుకోలేదు. కేసులు పెరిగాక కూడా లాక్​డౌన్​ అవసరం లేదంటూ పట్టుబడుతున్నారు. పైగా పెద్ద ఎత్తున మొదట్లోనే పరీక్షలు జరపలేదు.  

కేసులు పెరిగిపోగానే న్యూయార్క్​ సహా కొన్ని రాష్ట్రాలు లాక్​డౌన్​ను ప్రకటించాయి. కానీ, జనమెవరూ మాట విన్లేదు. ఎక్కడపడితే అక్కడ గుమిగూడుతూ వచ్చారు. బీచుల్లో తిరిగారు. బార్లలో తాగారు. పబ్బుల్లో చిందులేశారు. ఇటలీ జనం చేసిన తప్పులనే వాళ్లూ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అందువల్లే ఇప్పుడు కేసుల్లో అమెరికా టాప్​లో ఉంది. దీనికి కారణం ట్రంపేనని నిపుణులు మండిపడుతున్నారు.