బెంగళూరులో కరోనాను కట్టడి చేసే పరికరం  

అష్ట దిగ్బంధనాలకు కారణమవుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు బెంగుళూరుకు చెందిన డీ స్కలీన్ ప్రకటించింది. ఈ పరికరం కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని తెలిపింది. దీని సమర్థతను నిర్థరించేందుకు అమెరికాలోని మేరీలాండ్ విశ్వవిద్యాలయానికి పంపిస్తున్నట్లు తెలిపింది. 

డీ స్కలీన్ అనేది మెడికల్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ యూనిట్. ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తాము ఓ చిన్న పరికరాన్ని అభివృద్ధిపరిచామని తెలిపారు. దీనిని స్కలీన్ హైపర్‌ఛార్జ్ కరోనా కెనాన్ అని పిలుస్తున్నట్లు తెలిపారు. దీనిని ఇళ్ళు, ఆడిటోరియాలు, కార్యాలయాలు, పాఠశాలలు, కార్లు.... ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చునని పేర్కొన్నారు. 

అయితే కోవిడ-19తో బాధపడుతున్నవారికి ఈ పరికరం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఇది రోగాన్ని నయం చేసే పరికరం కాదని తెలిపారు. కేవలం ఈ వైరస్ వ్యాప్తిని ఈ పరికరం నిరోధించగలదని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ రోగితో కలిసి మరొక వ్యక్తి ఓ గదిలో ఉన్నపుడు, ఆ రోగి నుంచి ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ పరికరం కాపాడుతుందని తెలిపారు. ఈ పరికరాన్ని దగ్గర ఉంచుకుంటే కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందబోదని వివరించారు.

వైరస్‌ను తటస్థీకరించేందుకు తాము రూపొందించిన స్కలీన్ హైపర్‌ఛార్జ్ కరోనా కెనాన్ పరికరం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు, కుర్చీ లేదా బల్లపై కరోనా వైరస్ ఉన్నట్లయితే, అది అక్కడి నుంచి మనుషులకు చేరకుండా ఈ పరికరం నిరోధిస్తుందని తెలిపారు. ఈ పరికరం నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రాన్లు వెలువడతాయని, అవి వైరస్‌ను నాశనం చేస్తాయని వివరించారు. 

ఈ పరికరాన్ని కనుగొనడం వెనుక కారణాన్ని వివరిస్తూ తమ సంస్థలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సెలవులు పెడుతున్నారని, దీనిని అరికట్టేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని అనుకున్నట్లు తెలిపారు. ఒకరికి జలుబు చేస్తే, మిగతావాళ్ళకి అంటుకుంటుందని, ఫలితంగా సెలవులు పెట్టడం ఎక్కువవుతోందని చెప్పారు. 

దీంతో తమ సంస్థలోని శాస్త్రవేత్తలకు ఓ ఆలోచన వచ్చిందన్నారు. అన్ని రకాల ఫ్లూలను నాశనం చేసే పరికరాన్ని అభివృద్ధి పరచాలనుకున్నట్లు తెలిపారు. కనీసం తమ సంస్థలోనైనా ఒకరి నుంచి మరొకరికి జలుబు, ఫ్లూ వంటివి అంటుకోకుండా ఉపయోగపడే పరికరాన్ని రూపొందించాలనుకున్నామని పేర్కొన్నారు. 

కోవిడ్-19 ప్రపంచాన్ని దెబ్బ తీస్తుండటంతో, ఈ పరికరాన్ని దానిపై ప్రయోగించి చూడాలనుకున్నామన్నట్లు తెలిపారు. స్కలీన్ హైపర్‌ఛార్జ్ కరోనా కెనాన్ పరికరం సామర్థ్యాన్ని పరీక్షించాలని కోరుతూ అమెరికాలోని మేరీలాండ్ విశ్వవిద్యాలయానికి, మెక్సికోలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌కు లేఖలు రాశామన్నారు. 

మన దేశంలో ఫిబ్రవరి మొదటి వారంలో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయని, ఆ సమయంలో ఈ పరికరం గురించి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని, అక్కడి నుంచి స్పందన రావలసి ఉందని తెలిపారు.