తెలంగాణాలో ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు 

తెలంగాణలో ఇవాళ ఒక్క రోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం  సంఖ్య 59కి చేరిందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్‌ కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల్లో అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 

ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. 60,000 మందికి వ్యాపించినా అవసరమైన సాధనసంపత్తిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నామని, ఐసోలేషన్‌ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందించగలమని చెబుతూ 1400 ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉంచామని వివరించారు. 

500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాం..అవి వస్తున్నాయమని చెబుతూ 12400 ఇన్‌పేషంట్స్‌కు సేవలందించేందుకు బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  11వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలు వాడుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. 

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుత్రులు, పరీక్షా సదుపాయాలను మాత్రమే ఉపయోగించుకొంటున్నామని, మరింక అవసరమైతే ప్రైవేట్ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ఉపయోగించుకొంటామని, ఆ తర్వాత దశలోనే ప్రైవేట్ ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు. 

పోలీసులు, ప్రభుత్వ, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.   ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నామని ప్రకటించారు. కరోనా నియంత్రణకు శారీరక ధారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతూ చికెన్ తినొద్దని కొందరు దుర్మార్గులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని హితవు చెప్పారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సీ విటమిన్‌ ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారని గుర్తు చేశారు. నిమ్మ, సంత్రాలు, బత్తాయితో పాటు దానిమ్మ పండ్లు రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు బాగా ఉపయోగపడుతాయని తెలిపారు. 

మామిడి పండ్లు కూడా బ్రహ్మాండంగా తినొచ్చని అంటూ మన పండ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా మనమే తినేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పండ్ల వాహనాలను అడ్డుకోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.  

పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దని కేసీఆర్ కోరారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోనే పంటలు కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చారు. గోదాములు సరిపోకపోతే పాఠశాలలు, విద్యా సంస్థలను ఉపయోగిస్తామని చెప్పారు.