ప్రతి రాష్ట్రానికి కేంద్ర మంత్రులు ఇన్ ఛార్జ్ 

కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకొంటున్న చర్యలు రాష్ట్రాలలో అమలయ్యే టట్లు చూడడం మంత్రుల విధి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ  సహచరులకు స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.  ప్రతి రాష్ట్రానికి ఒక్కరిద్దరు మంత్రులను కేంద్రప్రభుత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సామాజిక దూరం పాటిస్తున్న విధానం, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు, మాస్క్‌లు, శానిటైజర్ల కొరత తదితర అంశాలపైపర్యవేక్షణ చేసే బాధ్యతలను వీరికి అప్పజెప్పారు.  ఇందులో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఒక మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించగా, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, పెద్ద రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. 

వీరు ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, సామాజిక దూరం, కార్వంటైన్‌లో ఉన్న వారికి కల్పిస్తున్న సదుపాయాలు, అవసరం ఉన్న వారికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ కిచెన్‌లు, ఇతర పరిస్థితులు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. 

జిల్లా మేజిస్ట్రేట్‌లు, జిల్లా కలెక్టర్‌లను అడిగి ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని తీసుకొని నివేదించమని మంత్రులకు సూచించారు.  ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయడంకోసం కూడా వీరు కృషి చేయవలసి ఉంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు రావడానికి మార్గం ఏర్పడుతుంది.