యుద్ధ ప్రాతిపదికపై హ్యాండ్ శానిటైజర్ల తయారీ 

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో కీలకమైన హ్యాండ్ శానిటైజర్లను సమకూర్చడం కోసం పెద్ద ఎత్తున వాటి తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకొంది. వీటిని తయారు చేయగలిగే డిస్టిలరీలు, పంచదార మిల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 

రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసి, పెద్ద మొత్తంలో హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయాలని కోరుతోంది. తాజాగా 45 డిస్టిలరీలకు, 564 మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు వీటి తయారీకి అనుమతులు మంజూరు చేసింది. మరొక 55 డిస్టిలరీలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయబోతోంది. 

ఇథనాల్ లేదా ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) ఉత్పత్తికి అనుమతుల మంజూరులో అడ్డంకులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎక్సయిజ్ కమిషనర్లు, చెరకు కమిషనర్లు, డ్రగ్ కంట్రోలర్లు, జిల్లా కలెక్టర్లు తదితర అధికారులను ఈ విధంగా ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో హ్యాండ్ శానిటైజర్ల తయారీకి 45 డిస్టిలరీలకు, 564 మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపింది. మరొక 55 డిస్టిలరీలకు రానున్న రెండు రోజుల్లో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. 

ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచేందుకు మూడు షిఫ్టుల్లో పని చేయాలని ఈ డిస్టిలరీలకు, మాన్యుఫ్యాక్చరర్లకు సూచించినట్లు పేర్కొంది. అనుమతులు పొందిన సంస్థల్లో కొన్ని ఇప్పటికే శానిటైజర్ల ఉత్పత్తిని ప్రారంభించాయని, మిగిలిన సంస్థలు మరో వారంలో ఉత్పత్తిని మొదలుపెడతాయని తెలిపింది.  

ఈ చర్యల ఫలితంగా వినియోగదారులు, ఆసుపత్రుల అవసరాలకు తగిన స్థాయిలో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.