కరోనా మహమ్మారిపై సమైక్య పోరాటం  

ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా విశ్వమారిపై సమైక్య పోరాటం చేస్తామని జీ-20 దేశాధినేతలు ప్రతిజ్ఙ చేశారు. కొవిడ్‌ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని పూడ్చడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 5 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపనను అందించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గురువారం అసాధారణ రీతిలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జీ-20 దేశాధినేతలు సమావేశమయ్యారు. 

ప్రస్తుతం జీ-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆల్‌ సౌద్‌ ఈ అత్యవసర సమావేశానికి నేతృత్వం వహించారు. ఇందులో ప్రధాని నరేంద్రమోదీతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, పలువురు దేశాధినేతలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సౌదీ రాజు సల్మాన్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు జీ-20 దేశాలు సమర్థవంతమైన, సమన్వయ కార్యచరణను రూపొందించాలని కోరారు. ‘కరోనా ప్రభావంతో సామాజికంగా, ఆర్థికంగా ప్రభావితమైన దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5 లక్షల కోట్ల డాలర్లను చొప్పించాలని నిర్ణయించాం’ అని వెల్లడించారు. 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. కరోనాపై ప్రపంచ దేశాలు యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ‘కొవిడ్‌ మనందరి ఉమ్మడి శత్రువు. ఇంతవరకూ ప్రపంచం చూడని ఈ మహమ్మారిని ఎదుర్కొనాలంటే అందరం సమిష్టిగా కృషి చేయాలి. పటిష్ఠమైన ప్రపంచ స్థాయి నెట్‌వర్క్‌ను నిర్మించాలి’ అని తెలిపారు. వైరస్‌ విస్తరించిన దేశాలకు అన్ని విధాల సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తెలిపేలా ‘ఆన్‌లైన్‌ కొవిడ్‌-19’ పేరిట ఓ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్న జిన్‌పింగ్‌.. ఈ సమాచారాన్ని అన్ని దేశాలు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో వాణిజ్య ప్రవాహాన్ని కొనసాగించేందుకు.. వివిధ దేశాలు టారిఫ్‌లను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. 

ప్రపంచ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జీ-20 దేశాలు తమ లక్ష్యాలను ఆర్థిక కోణంలో కాకుండా, మానవతా కోణంలో నిర్దేశించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు నూతన విపత్తు నిర్వహణ ఒప్పందాలను, విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అదేసమయంలో డబ్లూహెచ్‌వో వంటి సంస్థలను మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారు.