పలు రాష్ట్రాల్లో 6 నుంచి 9వ తరగతి పరీక్షలు రద్దు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. రాష్ట్రం లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్   వెల్లడించారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదని మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించేందుకు అవకాశాలు లేకపోవడంతో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ఆదేశించారు. 

వాలంటీర్ల సాయంతో విద్యార్థులకు నేరుగా డ్రైరేషన్ ఇవ్వాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాఠశాలలను ఎపి ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది. మధ్యాహ్న భోజనం అన్నిచోట్ల ఒకే క్వాలిటీ ఉండాలని, ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని జగన్ ఆదేశించారు.

తమిళనాడులో కూడా ఒకటవ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులు చేస్తున్నట్లు సిఎం పళనిస్వామి ఇప్పటికే ప్రకటించారు.  అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఆల్‌పాస్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యే అవకాశం కల్పించింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలు రాయకుండానే పై తరగతులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 

దాంతోపాటు పాత మైసూరు ప్రాంతంలోని సిబిఎస్‌ఇ పాఠశాలల్లో ఈ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పాస్ చేయాలని నిర్ధారించారు. తెలంగాణలో కూడా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ అయినట్లుగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టిఎస్‌జిహెచ్‌ఎంఎ)  ప్రభుత్వాన్ని కోరింది.