దేశవ్యాప్తంగా టోల్ గేట్ల దగ్గర ఫీజు  రద్దు  

కరోనా మహమ్మారితో దేశం వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో కేంద్ర రవాణాశాఖ దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్స్ వసూళ్లను తాత్కాలికంగా ఆపేసింది.  టోల్ ట్యాక్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 

కొన్నాళ్ల పాటు టోల్ ఫీజును రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. అత్యవసర సేవలు, సరుకు రవాణా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ తెలిపారు. పైగా, నగరాలలో ఉన్నవారు ఈ సమయంలో తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న దృష్ట్యా కుడా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరోవంక, దేశవ్యాప్తంగా రైలు సర్వీసులన్నిటిని ఏప్రిల్‌ 14 వరకు నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.  తొలుత మార్చి 31 వరకు గూడ్సు రైళ్లు మినహా ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేశారు. 

 ప్రధాని మంగళవారం 21 రోజుల వరకు  లాక్‌డౌన్‌ ప్రకటించిన  నేపథ్యంలో  బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.  అయితే, నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా గూడ్సు రైళ్లను యథాతథంగా నడుపుతారు.    

ఇలా ఉండగా, ఆర్బీఐ, ఆర్బీఐ నియంత్రించే ఫైనాన్షియల్‌ మార్కెట్లు, పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులు, కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ, పెన్షన్‌ సేవలు, అటవీ సిబ్బందిని లాక్‌డౌన్‌ పరిధి నుంచి మినహాయించారు. 

ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కార్గో సేవల నిర్వహణ సిబ్బంది, బొగ్గు తవ్వకాలు, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రెసిడెంట్‌ కమిషనర్లు, సిబ్బంది, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పనిచేసే కస్టమ్స్‌ సిబ్బందిని కూడా లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు. 

జంతు ప్రదర్శన శాలల(జూ) నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితోపాటు అనాధ బాలల సంరక్షణ సిబ్బంది, అనాథలు, వితంతు శరణాలయాలు, పశు వైద్యశాలలు, మందుల షాపులు (జన ఔషధి దుకాణాలతో కలిపి), ఫార్మా రీసెర్చ్‌ ల్యాబ్‌లు, బ్యాంకింగ్‌ ఆధారిత ఐటీ సేవలు, ఏటీఎం నిర్వహణ ఏజెన్సీలను కూడా లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు.