భారతీయుల రోగనిరోధకం అద్భుతం

దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతున్నప్పటికీ భారతీయులు ఆందోళన చెందనవసరం లేదని  ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ నరీందర్ మెహ్రా భరోసా ఇస్తున్నారు. భారతీయుల రోగనిరోధక శక్తీ అద్భుతం కావడంతో ఈ వైరస్ కారణంగా భారత్ లో భారీగా మరణాలు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. 

భారత ప్రజల రోగనిరోధక శక్తి చాలా దృఢమైనదని కావడంతో ఇతర దేశాల మాదిరిగా భారతదేశంలో మరణాల సంఖ్య పెరగదని ఐసిఎంఆర్ మాజీ జాతీయ ఛైర్మన్, ఎయిమ్స్ ఇమ్యునాలజీ మాజీ డీన్ డాక్టర్ నరీందర్ మెహ్రా స్పష్టం చేశారు. సాధారణంగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలో లింఫోసైట్ కౌంట్ పెరుగుతుంది, అయితే కోవిడ్ -19 దాడి చేసినప్పుడు శరీరంలోని  లింఫోసైట్ కౌంట్ తగ్గుతుందని ఆయన తెలిపారు. 

లింఫోసైట్లు అంటే తెల్ల రక్త కణాలు. ఇవి శరీరంలోని రోగనిరోధక కణాలలో ప్రధానమైనవి. రోగనిరోధక శక్తి విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని నరీందర్ మెహ్రా పేర్కొన్నారు. భారతదేశంలో వున్న అధిక వైవిధ్యం కారణంగా, రోగనిరోధక ప్రతిస్పందన జన్యువులు అంటే రోగనిరోధక శక్తికి మార్గనిర్దేశం చేసే జన్యువులు ఐరోపా దేశాల కంటే బలంగా ఉన్నాయని ఎయిమ్స్ అధ్యయనం వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు.