ఏపీలో నాలుగు ఆసుపత్రులల్లోనే కరోనా చికిత్స!

ప్రతి బోధనాసుపత్రిలో కొన్ని ప్రత్యేక పడకలు, ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయడం కంటే ప్రత్యేకంగా రాష్ట్రంలోని  4 వైద్య కళాశాలల పరిధిలోని ఆసుపత్రులను కేవలం కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే చికిత్స అందించేలా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల (ఇక్కడ వైరాలజీ ల్యాబ్‌ కూడా ఉంది), నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల, విశాఖపట్నంలోని విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌), తిరుపతిలోని ఎస్వీఎంసీ (రుయా)లను పూర్తిగా కరోనా వైద్యానికే కేటాయించాలని నిర్ణయించింది.  కరోనా కేసులకు మాత్రమే ఈ ఆసుపత్రులను వినియోగిస్తే  సాధారణ రోగులకు ఈ వైరస్‌ సోకదని భావిస్తోంది.    

సాధారణ రోగులకు ప్రత్యామ్నాయాలు
సిద్ధార్థ వైద్య కళాశాలకు వచ్చే రోగులు గుంటూరులోని సర్వజనాసుపత్రికి వెళ్లాలి.
నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే వారు నారాయణ మెడికల్‌ కాలేజీకి వెళ్లాలి. 
విశాఖ విమ్స్‌కు వెళ్లే రోగులందరూ  కింగ్‌ జార్జి ఆస్పత్రికి వెళ్లాలి.
తిరుపతిలోని రుయాకు వచ్చే రోగులు ఇకపై పద్మావతి మెడికల్‌ కాలేజీ పరిధిలోని స్విమ్స్‌కు వెళ్లాలి. 
ఈ నాలుగు కాలేజీల్లో కరోనా వైద్యానికి 4 వేలకు పైగా పడకలు గురువారం నాటికి అందుబాటులోకి రానున్నాయి. 
కరోనా చికిత్సకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఇతరత్రా ఔట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్, అత్యవసర సేవల నిలిపివేస్తారు. 

ఇలా ఉండగా, ఏపీలో  కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 8 నుంచి 10కి చేరింది. బుధవారం విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చినట్లు బుధవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిద్దరు ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల వచ్చినవారే.

రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమానిత లక్షణాలున్న 312 మంది నుంచి నమూనాలు సేకరించి వైద్యపరీక్షలకు పంపించారు. అందులో 229  నెగిటివ్‌ కాగా మరో 73 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. బుధవారం ఒక్కరోజు 13 నమూనాలు పంపించారు. 

రాష్ట్రంలో హోం క్వారంటైన్‌లో ప్రస్తుతం 15,143 మంది ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. 97 మంది ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత రెండు రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఒక్కటి కూడా నమోదు కాలేదని  వెల్లడించారు.