కోలుకొంటున్న చైనా, స్పెయిన్ లో ఒకేసారి ఉధృతం 

ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ వేగంగా విజృభింస్తున్నది. ఒక్క రోజే  48 వేలకు పైగా కేసులు నమోదవడంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 68 వేలు దాటింది. చనిపోయిన వారి సంఖ్య 21 వేలు దాటింది. గత 24 గంటల్లోనే కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా 2 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 1,13,800 మందికి పైగా కోలుకున్నారు. వీరిలో చైనా వారే 73 వేలకు పైగా ఉన్నారు.

కాగా, స్పెయిన్‌లో బుధవారం నాటికి 738 మందికిపైగా మరణించడంతో మరణాల్లో చైనాను ఆ దేశం దాటివేసింది. ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,600 దాటింది. చైనాలో ఇప్పటివరకు 3.281 మంది మృతి చెందారు. స్పెయిన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య  50 వేలకు దగ్గరలో ఉంది. ఇక ఇటలీలో నిన్న మరో 683 మంది చనిపోవడంతో  కరోనా మృతుల సంఖ్య 7,500 దాటింది. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 74,300 దాటింది.

స్పెయిన్ ఉప ప్రధానమంత్రి కార్మెన్ కాల్వో కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెను  ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

స్పెయిన్‌లో భారీగా అనుమానితులకు పరీక్షల నిర్వహణతో నిర్ధారణ కేసులు 20%, మరణాలు 27% పెరిగాయి. కరోనా నియంత్రణకు స్పెయిన్‌లో మార్చి 14 నుంచి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ 11రోజుకు చేరింది. 1,331 మరణాలు, 25,233 కేసు లతో నాలుగోస్థానంలో ఫ్రాన్స్‌, 841 మరణాలు, నిన్న మరో 11 వేల పాజిటివ్ కేసులు నమోదవడంతో అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  65,800 దాటింది.  నిన్న ఒక్కరోజే 155మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,000కు చేరుకొంది. 11 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

జర్మనీలో కరోనా కేసులు 37,300 దాటాయి. ఇరాన్‌లో 27 వేలకు పైగా, ఫ్రాన్స్‌లో 25,200 పైగా కరోనా కేసులు నమోదయ్యయి. యూకేలో నిన్న కొత్తగా 1450 కేసులు నమోదయ్యాయి. దీంతో యూకేలో ఇప్పటివరకు 9500లకు పైగా కేసులు నమోదయ్యాయి. జపాన్‌లో కరోనా కేసుల సంఖ్య 1300 దాటగా.. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 1063 మందికి కరోనా సోకింది.  

కామెరూన్‌, నైజీర్‌లో తొలి మరణాలు, లిబియా, లావోస్‌, బెలిజ్‌, గ్రెనడా, మాలి, డొమినికాలో తొలి కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో ఏడుగురు మరణించడంతో బుధవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. 

అత్యధికంగా 2,26,340 కేసులు, 13, 581 మరణాలతో ఐరోపా ఖండం టాప్‌లో ఉన్నది. ఆసియాలో 99,805 కేసులు, 3,593 మరణాలు సంభవించాయి.   ఆఫ్రికా ఖండంలో 2,382 కేసు లు, 64 మరణాలు, ద్వీప దేశాల్లో 2,656 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి.

మరోవంక కరోనా మహమ్మారి నుంచి చైనా కోలుకుంటున్నది. అంతర్గతంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా బయట నుంచి వ్యాపించే కేసులు పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరస్తున్నది. విదేశాల నుంచి తిరిగొచ్చిన వారివల్ల మంగళవారం 47 కొత్త కేసులు నమోదవ్వగా ఈ సంఖ్య 474కు చేరినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. 

మరోవైపు కరోనా కేంద్రం హుబీ రాష్ట్రంలో బుధవారం లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. రైళ్లు, బస్సు, విమాన సర్వీసులను పునరుద్ధరించారు. దీంతో 3 నెలలుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు పని ప్రాంతాలకు, సొంతూళ్లకెళుతున్నారు. కరోనా వ్యాప్తికి మూలమైన హుబీ రాజధాని వుహాన్‌లోనూ అంతర్గత బస్సు లను పునరుద్ధరించగా గ్రీన్‌ ఆరోగ్య కోడ్‌ పత్రాలున్న వారు ప్రయాణాలు చేశారు. నగరం నుంచి ఇతర ప్రాంతాల ప్రయాణాలపై ఏప్రిల్‌ 8 వరకు నిషేధం ఉన్నది.