కరోనా త్వరలోనే తగ్గుముఖం!

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ జీవ భౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కొవిడ్19కు త్వరలోనే తెరపడుతుందని ఆయన చెప్పారు. చైనాలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తగ్గిన తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుందని ఆయన అంచనా వేశా రు. 

చైనా తరహాలోనే అమెరికా కూడా త్వరలోనే కరోనానుంచి విముక్తి పొందుతుందని ఇది శాస్త్రవేత్తలు అంచ నా వేసిన దానికన్నా ముందే జరుగుతుందని కూడా లెవిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే లెవిట్ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను నిశితంగా అధ్యయనం చేస్తున్నా రు.

ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు భయాందోళనలను అధిగమించాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన సూచిస్తున్నారు. కరోనా వైరస్‌తో చైనాలో దాదాపు 80 వేల కేసులు నమోదు అవుతాయని లెవిట్ ఫిబ్రవరిలోనే అంచనా వేయగా, సరిగ్గా చైనాలో 80,298 కేసులు, 3,245 మరణాలు సంభవించడం గమనార్హం. 

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగినా మార్చి 16 నుంచి కొత్త రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహమ్మారిని రూపు మాపే విషయంలో మనం సరైన దిశలోనే సాగుతున్నామని లాస్ ఏంజిలిస్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.78 దేశాలనుంచి ప్రతిరోజూ కొత్తగా నమోదయ్యే 50కి కేసులను ఆయన విశ్లేషిస్తూ వైరస్ వ్యాప్తిలో కొంత రికవరీ ఉందని అంచనా వేశారు.