వైద్యులు ‘‘తెల్లకోట్లు వేసుకున్న దేవుళ్లు’  

కరోనా వైద్యులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ‘‘తెల్లకోట్లు వేసుకున్న దేవుళ్లు’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్న వారిని వేధించడం సిగ్గుచేటు అని తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. 

డాక్టర్లు, వైద్య సిబ్బందితో కొందరు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్తలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలతో ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..

‘‘ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఇవాళ మనకు దేవుళ్లతో సమానం. ఓ మహమ్మారి నుంచి వాళ్లు మనల్ని కాపాడుతున్నారు. మనల్ని కాపాడడం కోసం వాళ్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు..’’ అని ప్రధాని తెలిపారు. 

వైద్య సిబ్బందితో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు తెలిస్తే... అలా ప్రవర్తించేవాళ్లు తప్పుచేస్తున్నారని అర్థమయ్యేలా చెప్పాలంటూ ప్రజలను కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి సహకరించని వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హోంశాఖను ఆదేశించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. 

కాగా,  కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్నా 90131 51515 నంబర్‌కు వాట్సాప్ చేయాలని మోదీ సూచించారు. కరోనాపై 21 రోజుల పాటు యుద్ధం చేయాలని ఇది మహాభారత యుద్ధం కంటే మూడు రోజులు పెద్దదని చెప్పారు. దేనికైనా మనసు ఉంటే మార్గం ఉంటుందని, కరోనాకు కూడా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సామాజిక దూరం పాటిస్తూ కరోనాను నివారించగలమని స్పష్టం చేశారు. దీనికి వారణాసి ప్రజలు దేశానికే ఆదర్శంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ఐకమత్యంతో కరోనాను ఎదుర్కొందామని, ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని మోదీ ఆకాంక్షించారు.