అయోధ్యలో రాముడి విగ్రహం తరలింపు 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక ఘట్టానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చైత్ర నవరాత్రి​ పర్వదినం పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగంణంలోకి తరలించారు. 

ఆదిత్యనాథ్‌ స్వయంగా తన చేతుల మీదుగా రామ జన్మభూమి ప్రాంగణంలోని మాసస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు. రామమందిరం నిర్మాణం చేపట్టడం కోసం రాముని విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలోకి తరలించారు.  తాత్కాలిక నిర్మాణంలో 9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. 

శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో సభ్యునిగా ఉన్న రాజ అయోధ్య విమలేంద్ర మోహన్‌ మిశ్రా ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చారు. జైపూర్‌కు చెందిన కళాకారులు దీనిని తయారుచేశారు. 

రామమందిరం నిర్మాణం పూర్తయ్యే వరకు రాముడి విగ్రహం తాత్కాలిక నిర్మాణంలోనే ఉంచనున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి ఆదిత్యనాథ్‌ అయోధ్యకు చేరకున్నారు. ఆలయ నిర్మాణం కోసం సీఎం యోగి రూ. 11లక్షల విరాళాన్ని అందించారు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు అయోధ్య జిల్లా అధికారులతో పాట, కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. రామాలయ నిర్మాణానికి భూమి పూజ తేదీని ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.