దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ తో సామాజిక దూరం 

ప్రాణాంతక కోవిద్-19 వ్యాప్తి నిరోధానికి సామజిక దూరాన్ని కట్టడి చేయడమే మార్గమని పేర్కొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో గత అర్ధ రాత్రి నుండి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన్నట్లయింది. అప్పటికే దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ లను అమలు పరుస్తుండగా, ప్రధాని మరో రెండు వారల పాటు పొడిగించినట్లు అయింది.  

పైగా, ప్రధాని ఈ లాక్‌డౌన్‌ను జాతీయ పరిధిలోకి తీసుకొచ్చారు. దేశమంతా ఒకే మార్గదర్శకాలు అమలయ్యేట్లు హోంశాఖ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది.. అనవసరంగా రోడ్లపైకొచ్చి తిరుగాడితే విపత్తు సహాయ చట్టంలోని సెక్షన్లు 51 నుంచి 60 కింద రెండేళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో విధి నిషేధాలేంటి? తెరిచి ఉంచేవేంటి?

తెరిచి ఉంచేవి: వైద్య సేవలు, మెడికల్ షాపులు, నర్సింగ్ హోమ్ లు, ల్యాబ్ లు, క్లినిక్ లు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది చేరవేతకు అనుమతి. 

నిత్యావసరాలు: ఆహార దినుసులు, పళ్ళు, కూరగాయలు,  డైరీ, మిల్క్ బూత్ లు, మాంసం, చేపలు, పశు దాణా (ప్రజల రాకపోకలు తగ్గించేందుకు ఇళ్లవద్దనే సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలి)

ఆర్ధిక సేవలు: బ్యాంకులు, ఎటిఎం లు, భీమా కార్యాలయాలు 

మీడియా: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, వాహనాలు 

కమ్యూనికేషన్స్: టెలికాం, ఇంటర్నెట్ సేవలు, కేబుల్, బ్రాడీకాస్టింగ్, అత్యవసరమైన ఐటి ఆధారిత సేవలు (వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఉపకరించేవి)

నిత్యావసరాల సరఫరా: ఆహారం, మందులు, ఈ కామర్స్‌ ద్వారా వైద్య ఉపకరణాలు. వీటిని తయారు చేసేవారికీ అనుమతి.

పెట్రో ఉత్పత్తులు:  పెట్రోల్‌ బంకులు, వంటగ్యాస్‌, గ్యాస్‌  స్టోరేజీ షాపులు

విద్యుత్‌: విద్యుదుత్పత్తి,  సరఫరా, పంపిణీ, సేవల సిబ్బంది శీతలీకరణ కేంద్రాలు, వేర్‌హౌసింగ్‌ సేవలు.

లాడ్జిలు: లాక్‌డౌన్‌తో చిక్కుబడితే బస చేసే హోటల్స్‌, లాడ్జిలు, టూరిస్టులు ఉండే హోటల్స్‌, మోటార్‌ సిబ్బంది వాడే మోటెల్స్‌కు మినహాయింపు.

అత్యవసర సేవలు: రక్షణ, పోలీసు, సాయుధ పోలీసు, విపత్తు సహాయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవలు, జిల్లా ట్రెజరీలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బంది, అత్యవసర సేవలందించే మునిసిపల్‌ సిబ్బంది.. అత్యవసర సేవలను అందించేవారిని, నిత్యావసరాల చేరవేతకు అనుమతి.

ఎవరైనా మరణిస్తే: ఏ ఇంట్లోనైనా ఎవరైనా మరణిస్తే 20 మందికి మించి  ఉండరాదు. అంత్యక్రియల నిమిత్తం ఎలాంటి అవసరమైనా పొందవచ్చు. 

శిక్షలు:  లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు. తప్పుడు సమాచారమిచ్చి ఉల్లంఘనకు పాల్పడితే ఏడాది జైలు, జరిమానా. నగదు, సరుకులను నిల్వ చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా. ఉత్తుత్తి వ్యాఖ్యలు, ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తేట్లు ప్రవర్తిస్తే ఏడాది జైలు.