ప్రధాని ఉగాది శుభాకాంక్షలు 

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది... ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. 

ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. అదే విధంగా వివిధ భాషల్లో ప్రజలకు ట్విటర్‌ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, మహమ్మారి కరోనా వైరస్‌  విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ప్రతీ పౌరుడిని జాగ్రత్తగా చూసుకుంటున్న వారి అంకితభావం గొప్పదని కొనియాడారు. జాతి కోసం వారు చేస్తున్న సేవలకు భారత్‌ సలాం చేస్తుందన్నారు. అదే విధంగా.. ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి. ఇంట్లోనే ఉండండి అంటూ ఓ వీడియోను మోదీ షేర్‌ చేశారు.