ఏపీలో జిల్లాల మధ్య రాకపోకల బంద్ 

ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్  వాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను రాకపోకలు నిలిపివేసినట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు.  తెలంగాణ సరిహద్దుతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో సంబంధం ఉన్న అన్ని మార్గాలు దిగ్బంధించారు. సరిహద్దుల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. అత్యవసర వాహనాలు మినహా వేటినీ అనుమతించడం లేదు.   

రాష్ట్ర సరిహద్దుల్లో, రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆంక్షలు ధిక్కరించి వస్తున్న వాహనదారులకు కరోనా తీవ్రతను వివరిస్తూ పోలీసులు, రవాణా శాఖ అధికారులు నచ్చజెప్పడంతో వారు వెనుదిరుగుతున్నారు.   కోదాడ, భద్రాచలం, నాగార్జున సాగర్‌లతో పాటు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. 

మరోవైపు మంగళవారం ఉదయం లాక్‌డౌన్‌ నిబంధనలను లెక్కచేయకుండా పలు చోట్ల ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో పోలీసులు కొంత కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చింది. నెల్లూరు, విజయవాడ, చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో రోడ్ల పైకి వచ్చిన వారిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.కొన్ని ప్రాంతాల్లో లాఠీలు ఝులిపించారు. 

చిత్తూరు, నెల్లూరు, గుంటూరు పట్టణాల్లో వాహనదారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఒకటికి రెండుసార్లు తిరుగుతూ టాబ్లెట్ల కోసమని చెబుతున్న కొంతమంది యువకులను పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. మరోసారి దొరికితే బండి సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. విజయవాడ రామవరప్పాడు రింగు సెంటర్లో వాహనాలను అదుపు చేస్తున్న శ్రీధర్‌ అనే కానిస్టేబుల్‌ను క్వాలిస్‌ వాహనం ఢకొీట్టింది. అతనికి తీవ్రగాయాలు కావడంతో తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 

ప్రకాశం జిల్లాలో ఒంగోలు, టంగుటూరులో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పెదదోర్నాలలో వాహనదారులతో గుంజీలు తీయించారు. గుంటూరులో 107 ఆటోలను సీజ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.14.66 లక్షలు జరిమానా విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న 2300 మందిపై కేసులు నమోదు చేశారు. 288 వాహనాలను సీజ్‌ చేసినట్లు డిజిపి గౌతంసవాంగ్‌ తెలిపారు. 

విదేశాల నుండి వచ్చేవారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అవసరమైతే పాస్‌పోర్టులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. విశాఖలో మూడు ప్రాంతాలను హైరిస్క్‌ జోన్లుగా ప్రకటించారు. నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఉదయం తొమ్మిది గంటల వరకే అనుమతి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబజార్లు కిటకిటలాడాయి. విజయవాడలో పాజిటివ్‌ నమోదైన వ్యక్తి కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా వారిని 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు.