తెలంగాణలో ఇంటింటి ఆరోగ్య సర్వే 

రోజురోజుకు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యేక ప్రణాళికలతో వైరస్‌ను వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 36 కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమైనారు. దానితో రాష్ట్రంలో జ్వరం బారిన పడిన ప్రతి వ్యక్తికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. 

దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఇంటింటికి సర్వే కార్యక్రమం ప్రారంభించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలు, రెవెన్యూ అధికారులతో సమన్వయమై ప్రతి కుటుంబంలో నివసించే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆయా గ్రామల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందిస్తారు. 

ఎవరికైనా, దగ్గు, జ్వరం జలుబు ఉంటే వెంటనే వారిని వైద్య పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ ఉండాలని కోరుతున్నారు. ఈ సర్వేలో మొత్తం ప్రభుత్వ వైద్యులతో పాటు 26 వేల ఆశావర్కర్లు, 8 వేల ఎఎన్‌ఎమ్‌లు, ఇతర సిబ్బంది పాల్గొంటున్నారు. ఫీవర్, చెస్ట్, గాంధీ, కోఠి హాస్పిటల్‌లో ఓపి సేవలు ఆగిపోయా యి. దీంతో పాటు అత్యవసరం సర్జరీలు తప్ప, ఇతర శస్త్రచికిత్సలు చేయమని వైద్యాధికారులువెల్లడించారు.

కరోనా వ్యాధిగ్రస్తులను వేగంగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇప్పటి వరకు విదేశాల నుంచి ఎంత మంది వచ్చారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నాయా? రాష్ట్రానికి ఎప్పుడు వచ్చారు? సదరు వ్యక్తులకు కిడ్ని, ఊపిరితిత్తు ల సమస్యలు ఉన్నాయా? ఎయిర్‌పోర్ట్‌లో క్వారంటైన్ ముద్ర వేశారా? వేస్తే నిజంగా ఇంట్లోనే ఉంటున్నారా? ఆయా గ్రామాల్లో అనుమానిత లక్షణాలు వాళ్లు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలను ఈ యాప్‌లో పొందుపరుస్తారు. 

ఆయా వివరాలు ద్వారా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జిల్లా వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో పాజిటివ్ వచ్చిన ఇళ్ల సమీపంలో 150 మంది వైద్య బృందాలు సర్వే చేపడుతున్నాయి. కరోనా వైరస్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు  సచివాలయంలో మరో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కోఠి డిఎంఇ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల, ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు, పర్యవేక్షణలు నిర్వహిస్తున్నారు. 

ఈ కంట్రోల్ రూంలో సేవలు కోసం 104ను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి బయటకు వచ్చే వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 19న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ యువకుడికి హోం క్వారంటైన్‌లో ఉండాలని స్టాంప్ వేసి అధికారులు సూచించారు.