అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా  

ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు ప్రపంచ దేశాలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ అదే స్థాయిలో వైరస్‌ వ్యాపిస్తున్నది. ఆసియాలోని చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. ఐరోపాలోని ఇటలీలో స్వైర విహారం చేసింది.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్నది.

సోమవారం నుంచి 24 గంటల్లో ఐరోపా అంతటా 20,131 నూతన కేసులు బయట పడితే, కేవలం అమెరికాలోనే కొత్తగా 16,354 మందికి వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికార ప్రతినిధి మార్గరేట్‌ హరీస్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా అంతటా 49,594 మందికి కరోనా పాజిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తేలింది. గత 24 గంటల్లో తొలిసారి 130 మందికిపైగా మృ త్యువాత పడటం అమెరికాను కలవరానికి గురి చేస్తున్నది. 

కరోనా వైరస్‌కు కేంద్రంగా అమెరికా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. అమెరికాలో శరవేగంగా పెరుగుతున్న కేసులు, దాని తీవ్రతను బట్టి కరోనాకు ప్రధాన కేంద్రంగా అమెరికా మారే రోజు ఇంకెంతో దూరంలో లేదని స్పష్టమవుతుందని హారిస్‌ చెప్పారు  

ఆ దేశంలో మొత్తం మరణా లు 622కి చేరాయి. న్యూయార్క్‌లో 157 మంది వైరస్‌తో మరణించారు. సోమవారం 5,085 కేసులతో కలిపి 20,875 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్య పరికరాలు, ఔషధాలతోపాటు హ్యాండ్‌ శానిటైజర్లు, ఫేస్‌ మాస్క్‌లు తదితర వ్యక్తిగత రక్షణ పరికరాల కృత్రిమ కొరతను నిరోధించడానికి, వ్యాపారులు వాటిని ఎక్కువ ధరలకు విక్రయించకుండా నిలువరించేందుకు రూపొ ందించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. 

కరోనా వైరస్‌ కట్టడికి దేశమంతా ‘షట్‌డౌన్‌' ప్రకటించాలన్న వైద్యుల సూచనను అమలు చేయడానికి వ్యతిరేకం అని ట్రంప్‌ చెప్పారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటుందన్నారు. ప్రపం చం మొత్తం ఏండ్లుగా లాక్‌డౌన్‌ ప్రకటించినా తాము ఆ పని చేయమన్నారు. కరోనా నివారణలో కీలకంగా భావిస్తున్న క్లోరోక్వీన్‌ ఔషధ నిల్వలను సేకరించడంపై దృష్టిని కేంద్రీకరించామన్నారు. ఆసియా అమెరికన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ చెప్పారు. 

ఇంతకుముందు కరోనా వైరస్‌ను ‘చైనీస్‌ వైరస్‌' అని ట్రంప్‌ పేర్కొన్న తర్వాత ఆసియా దేశాలకు చెందిన అమెరికన్లపై దాడుల నేపథ్యంలో ఇలా స్పందించారు. అమెరికాలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌ రాష్ర్టాలపై వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ర్టాల పరిధిలో సైన్యాన్ని రంగంలోకి దించారు. 

బ్రిటన్‌లో కొత్తగా 54 మంది మృతితో మొత్తం మరణాలు 422కి, వైరస్‌ బాధితుల సంఖ్య 8,077కి చేరుకున్నది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ దేశంలో 3 వారాలు లాక్‌డౌన్‌ ప్రకటించారు. థాయిలాండ్‌లో మరణాలు నాలుగుకు చేరాయి. దీంతో గురువారం నుంచి నెల రోజులు అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఆ దేశ ప్రధాని ప్రయుథ్‌ చాన్‌ ఓచా చెప్పారు. 

196 దేశాల్లో కరోనా మరణాలు 18,810కి చేరాయి.  4,21,413   మందికి కరోనా వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఇటలీలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శనివారం రికార్డు స్థాయిలో 793 మంది, ఆదివారం 651, సోమవారం 601,  మంగళవారం 743 మంది మరణించారు. మొత్తంగా  6,820 మంది చనిపోగా 69,176 మందికి వైరస్‌ సోకింది. చైనాలో కొత్తగా 78 పాజిటివ్‌ కేసులు రికార్డు 

కాగా, ఏడుగురు మృత్యువాత పడగా మొత్తం 3,277 మంది మరణించారు. స్పెయిన్‌లో 2800, ఇరాన్‌లో 1934, ఫ్రాన్స్‌లో 860 మంది మృత్యువాతపడ్డారు. ఐస్‌లాండ్‌లో తొలి మరణం, మయన్మార్‌లో తొలి కేసు నమోదైంది. పశ్చిమాసియాలో 1966, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల్లో 112  మరణాలు సంభవించాయి.