అర్ధరాత్రి నుండి దేశ వ్యాప్తంగా 21 రోజుల దిగ్బంధనం 

ఈరోజు అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ సంపూర్ణ మూసివేత 21 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. భారత దేశ చరిత్రలో, చివరకు యుద్ధ సమయంలో కూడా ఇన్నో రోజులపాటు దిగ్బంధనం ప్రకటించిన దాఖలాలు లేవు. 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని చెప్పారు. కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ వివరించారు.

ఇది ఒకరకంగా కర్ఫ్యూ వంటిదేనని ప్రధాని చెప్పారు. రాబోయే 21 రోజులు ప్రతి ఒక్కరికీ కీలకమని చెబుతూ దేశానికి ఇది పరీక్షా సమయమని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.   సామాజిక దూరం పాటించడమే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పరిష్కారమని పేర్కొన్నారు.

 మొదటగా ఈ వ్యాధిని పెద్ద ఎత్తున ఎదుర్కొని, భారీ నష్టాలకు గురైన చైనాలో నిరంకుశ పాలనా ఉన్నప్పటికీ దేశవ్యాప్త దిగ్బంధనం చేయక పోవడం గమనార్హం. 

దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన హితవు చెప్పారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ స్పష్టం చేశారు. 

దేశంలో వైద్య మౌలిక సదుపాయాలను పెంపొందింపడం కోసం రూ 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి చెందిన దేశంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నరునై గుర్తు చేశారు.  

ప్రపంచ పరిణామాలను మనం పరిశీలిస్తున్నామని, అగ్రరాజ్యాలను సైతం ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేని చెబుతూ వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. 

తాను ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక వ్యక్తి నుంచి వేల మందికి వైరస్‌ వ్యాపించవచ్చని చెబుతూ 11 రోజుల్లోనే లక్ష నుంచి రెండు లక్షల మందికి సోకిందని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు వెల్లడించాయని గుర్తు చేశారు.