మాట వినకపోతే కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత  

ఆంక్షలను పాటిస్తూ పౌరులు ఇంటికే పరిమితం కాలేని పక్షంలో  24 గంటల కర్ఫ్యూ విధించడం, అదీ కూడా వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు ఇవ్వడం, సైన్యాన్ని రంగంలోకి దింపడం తప్పదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హెచ్చరించారు. కరోనా కట్టడికి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లోరాష్ట్రాన్ని రక్షించుకునే దిశలో ఏ నిర్ణయం అయినా తీసుకునే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. 

సాటి మనుషులకు..సమాజానికి ఇబ్బందులు వచ్చేలా ప్రవర్తిస్తే వారికి ఉన్న అన్నీ లైసెన్సులు రద్దు చేయబడతాయని చెప్పారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి పాస్ పోర్టులు కలెక్టరేట్‌లో పెట్టుకోవాలని సూచించారు. దేశంలో 40 మంది చనిపోయారని, అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఎవరిని వెంటిలేటర్‌ల మీద పెట్టాల్సిన క్రిటికల్ పరిస్థితి లేదని పేర్కొన్నారు. 

‘రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో పౌర బాధ్యతలను పాటించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కఠినమైన నిబంధనలను పాటించక తప్పదు' అని తెలిపారు.  ప్రైవేటు కార్మికులకు ఈ నెల మొత్తం వేతనం ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌లు ఆదేశాలు ఇవ్వమని చెప్పారు.  వ్యవసాయ శాఖకు సంబంధించిన పనులకు అంతరాయం కలిగించొద్దని సూచించారు. 

జనం గుంపు గుంపులుగా ఉండొద్దు. ఎమర్జెన్సీ అవసరల పట్ల పోలీస్‌లు జాగ్రత్తగా వ్యవహరించండి. శానిటేషన్ రెగులర్‌గా జరగాలి.  గ్రామ, పట్టణ పరిశ్యుద్ధం బాగా ఉండాలి. ప్రతి రోజు ప్రతి ఊరు శుభ్రంగా ఉండాలని వివరించారు. 

జిల్లా  హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి  జాబితాను దగ్గర పెట్టుకోవాలని, కలెక్టర్‌లు  జిల్లా లోని అన్నీ ఆసుపత్రిలను సందర్శించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంఖ్యని బట్టి డ్యూటీలు వేయాలని,  సామాజిక స్పృహ ఉన్న వారిని కంట్రోల్ రూమ్‌లో  పెట్టాలని, ప్రజలతో మంచిగా మాట్లాడాలని సూచించారు. 

విదేశాల నుంచి వచ్చిన వారిలో 32 మంది‌కి వైరస్ అంటుకుందని ఆయన తెలిపారు. కరోనా లక్షణాలున్న  అనుమానితులను హైదరాబాద్‌లో పరీక్షించి ..పాజిటివ్ వస్తే ఇక్కడే చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రష్యా‌లో కఠినంగా ఉంటూ, హైరిస్క్ తీసుకున్నారు కాబట్టి..ఒక్క కేసు పాజిటివ్ లేదని గుర్తు చేశారు.

అత్యంత శక్తి వంతమైన అమెరికాలోనే 50 వేల మంది కరోనా బారిన పడ్డారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా వైరస్  తగిలిచుకుంటే తప్ప...దాని అంతటా వచ్చే వ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. గుంపులుగా ఉండకుండా చూడాలని.. జిల్లా యంత్రాంగం చాలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 

రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకి రావద్దని స్పష్టం చేశారు. అన్నీ నిత్యావసర సరుకుల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసి వేయాలని సూచించారు. మాట వినకపోతే సీజ్ చేసి.. మూసి వేయాలని కలెక్టర్‌కు  సీఎం కేసీఆర్ ఆదేశించారు.