కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు 

కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.  విదేశాల నుంచి వచ్చిన వాళ్ల కుటుంబాలకు కరోనా సోకుతోందని చెబుతూ కరోనా నివారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

కరోనా రాదనుకునే భావన ఎవరిలో ఉండొద్దని హెచ్చరించారు. కరోనా వైరస్‌కు ధనిక, పేద, గ్రామం, నగరం అనే తేడా ఏమీ లేదని, ముందస్తు జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని చెప్పారు. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని చెబుతూ  తెలుగు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కిషన్ రెడ్డి కోరారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 24 వేల 266 మందికి స్క్రీనింగ్ చేశామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో 492 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 37 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 69వేల 436 మందిని హౌస్ క్వారంటైన్ చేశామని, 20,707 మంది శాంపిల్స్‌ టెస్ట్ చేశామని, ల్యాబ్‌ల సంఖ్యను 118కి పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

దేశ వ్యాప్తంగా 94,963 క్వారంటైన్ బెడ్లను సిద్ధం చేశామని చెబుతూ ప్రతి రోజు 20వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్రం ఖర్చుతో 48 దేశాల నుంచి 2040 మంది భారీతీయులను తీసుకొచ్చామని వివరించారు.