రాజ్యసభ ఎన్నికలు వాయిదా  

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి నడుం బిగించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సరికాదని భావించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 17 రాష్ట్రాల నుండి 55 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. 

జన సమూహం లేకుండా ఉంచేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుపుతున్న సమయంలో ఇప్పుడు ఎన్నికలు జరపడం భావ్యం కాదని ఎన్నికల సంఘం భావించింది.  ప్రజారోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జన సమూహం అధికంగా ఉంటుంది. ఆ సమూహంలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా.. అది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 

అయితే ఎన్నికలు తిరిగి ఎపుడు జరపాలి ఇంకా నిర్ణయించలేదు. ఈ నెలాఖరు తర్వాత పరిష్టితులను బట్టి నిర్ణయించే అవకాశం ఉంది.