కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ముఖ్యమంత్రి కె చంద్రసేఖరరావు నిప్పులు చెరిగారు. సిగ్గు లేకుండా చంద్రబాబుతో పొత్తు కలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అంటూ   “థూ.. మీ బతుకులు చెడ.. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. తెలంగాణ ద్రోహి.. చెడిపోయి చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేఅసారు. కరెంట్ ఇవ్వకుండా రాక్షాసనందం పొందిన రాక్షాసి చంద్రబాబు అనంటూ మళ్లా ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా? అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో ప్రసంగిస్తు ఈ దుర్మార్గులు ప్రజల మనసును కలుషితం చేస్తున్నారని, ఉద్యోగుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారని ద్వజమెత్తారు. “ప్రజల తీర్పు కోరుదాం.. మళ్లీ ఐదేండ్లు సుస్థిరంగా పాలిద్దామని మా నాయకులు చెప్పారు. ఆ క్రమంలోనే తొమ్మిది నెలల అధికారాన్ని త్యాగం చేశాం. చావు నోట్లో పెట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను అమరావతికి పంపిస్తారా?” అంటూ ప్రజలను ప్రశ్నించారు.  

చంద్రబాబు రూ 500 కోట్లు ఇస్తాడంట. మూడు హెలికాప్టర్లు పెడుతారంటా.. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని అంటూ ప్రజలను హెచ్చరించారు. ఏడు మండలాలు లాక్కున్న చంద్రబాబుతో జతకట్టడం మరోసారి తెలంగాణను మోసం చేయడమేనని దయ్యబట్టారు. కరెంట్ ఇవ్వకుండా రాక్షాసనందం పొందిన రాక్షాసి చంద్రబాబు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతారా? అని అడిగారు.

“కాంగ్రెసోళ్ల నిర్ణయం ఇక్కడ ఏమైనా ఉంటుందా? అంతా ఢిల్లీలోనే. ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని చెబుతున్నా. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. మళ్లీ 9 స్థానాలను టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టాలి. టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి” అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాగా, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన హామీలపై కుడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్‌ను ఉద్దేశించి “ఆయన ఒకటి చెప్పిండు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఇండ్ల కిరాయిలు కడుతాడంటా. ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ స్కీమ్. ఎన్నికల ముందు నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న నాడు ఏం చేయలేదు. మోదీ, అమిత్ షా గత ఎన్నికల ప్రచార సభల్లో విదేశాల నుంచి నల్లధనం తీసుకువస్తామన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పలేదా?” అని నిలదీశారు.

ఆనాడు మోడీ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తే తామే ఇళ్ల కిరాయిలు కడుతామని చెప్పారు. ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా? అంటూ ప్రజలెవరూ మోసాలకు గురికావొద్దని హెచ్చరించారు. చెప్పేటోడు చెవిటోడు అయినా.. వినేతోడికి ఇజ్జత్ ఉండాలి కాదా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌తోనే సుభిక్షంగా ఉంటుందని కెసిఆర్ స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేసులు.. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసులు వేస్తారని ఎద్దెవా చేశారు. “సొల్లు పురాణం చేస్తారు కాంగ్రెసోళ్లు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పిన. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు" అంటూ ద్వజమెత్తారు.