సోమ్‌నాథ్‌ ఛటర్జీ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ(89) కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఛటర్జీ 40 రోజుల క్రితం మెదడులో నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు.

 

మూడ్రోజుల తరువాత పరిస్థితి మెరుగవడంతో డిశ్ఛార్జి అయ్యారు. మళ్లీ మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాసపై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

 

1968లో సీపీఎం కార్యకర్తగా ప్రజాజీవితంలో మమేకమైన ఛటర్జీ అనతికాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. యూపీయే హయాంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్‌గా వ్యవహరించారు. అయితే భారత్ – అమెరికా అణు ఒప్పందంకు నిరసనగా ప్రభుత్వంపై సిపియం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయమని పార్టీ కోరినా తిరస్కరించడంతో ఆయనను సిపియం నుండి బహిష్కరించారు. అప్పటి నుండి మరే పార్టీలో చేరనే లేదు.