కరోనా వైరస్‌పై పోరు ‘జీవితకాల సవాల్‌'  

కరోనా వైరస్‌పై పోరు ను ‘జీవితకాల సవాల్‌'గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. ఈ వైరస్‌ కట్టడికి వినూత్న, సరికొత్త పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇలాంటి విపత్కర సమయంలో మీడియా సిబ్బంది ఈ దేశానికి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. 

మహమ్మారి తీవ్రతను, దాని దుష్ప్రభావాలను అర్థం చేసుకొని ప్రజల్లో అవగాహన పెంచుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను, నిరాశావాదాన్ని పోగొట్టేలా సానుకూల కథనాలు ప్రసారం చేయాలని మీడియాను కోరారు. 

‘మనం సుదీర్ఘ యుద్ధం చేయాల్సి ఉన్నది. సామాజిక దూరంపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలి. తాజా పరిస్థితులు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు, ఇతరాంశాలను వేగంగా, సులభంగా అర్థమయ్యే భాషలో ప్రజలకు వివరించాలి’  అని సూచించారు. కరోనాపై పోరులో మీడియా చానళ్ల ఫీడ్‌బ్యాక్‌ ఎంతో కీలకంగా మారుతున్నదని, దానికనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. 

క్షేత్రస్థాయిలోని విలేకరులు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ప్రధాని మోదీ కోరారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో కనీసం ఒక మీటరు ఎడం పాటించాలని చెప్పారు. మీడియా సంస్థలు తమ విలేకరులకు ‘బూమ్‌ మైక్‌'లను అందజేయాలని సూచించారు.

మీడియా శాస్త్రీయమైన సమాచారాన్నే ప్రసారం చేయాలని, నిపుణులతోనే చర్చలు నిర్వహించాలని చెప్పారు. తద్వారా వదంతులు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. శాస్త్రీయ కథనాల ప్రసారం ద్వారా పుకార్లకు అడ్డుకట్ట వేయాలని ప్రధాని విన్నవించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు డిజిటల్‌ చెల్లింపులు పెరిగేలా చైతన్యం తేవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రధాని మోదీకి పలు సూచనలు చేశారు. తరుచూ జాతినుద్దేశించి ప్రసంగించాలని కోరారు. ఇందులో సానుకూల కథనాలు, కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నవారి అనుభవాలను ప్రస్తావించాలని సూచించారు. 

మీడియా ప్రతినిధులను పరీక్షించేందుకు 24గంటలపాటు అందుబాటులో ఉండేలా వైద్య బృందాన్ని నియమించాలని కోరారు. అధికారిక సమాచారాన్ని ప్రసార భారతి ద్వారా రోజుకు రెండుసార్లు వెల్లడించాలని, దానినే ప్రసారం చేస్తామని చెప్పారు.