ఎట్టకేలకు షాహీన్ బాగ్ ఆందోళనకు తెర

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా వందరోజులు పైగా ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద మహిళలు జరుపుతున్న ఆందోళనకు ఎట్టకేలకు తెరపడింది. కోవిద్ -10 వ్యాప్తితో సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడం, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా  దేశ రాజధాని ఢిల్లీలో  ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను పోలీసులు తొలగించారు. 

పోలీసు అధికారుల బృందం మంగళవారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని నిరసనకారులను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. టెంట్లు, ఇతర సామగ్రిని నిరసన స్థలం నుండి తొలగించారు. అప్పటికే ఢిల్లీలో వివిధ ప్రాంతాలలో జరుపుతున్న నిరసనలను ముగించిన ఆందోళనకారులు షహీన్ బాగ్ వద్ద కూడా ముగించాలని గత వారంగా వారిపై వత్తిడి తెస్తున్నారు. 

ఈ సందర్భంగా కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని  ఆగ్నేయ  ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆర్‌పి మీనా చెప్పారు. మార్చి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని, నిరసనకారులు ఒకరికొకరు మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలని ఆదేశించారు. అలాగే  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం మైక్రోఫోన్ వాడకూడదని  కూడా హెచ్చరించారు.