ఇక ఏపీలో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు

రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అమలు పరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటించినా సోమావారం ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభావం కనిపించక పోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సిరియస్ సీరియస్ అయిన్నట్లు తెలిసింది. దానితో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మంగళవారం నుండి కఠినంగా అమలు పరచడానికి సమాయత్తం అవుతున్నది. 

ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేయడంతో పాటు కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆదివారం దేశవ్యాప్తంగా 80 జిల్లాలకు లాక్‌డౌన్‌ ప్రకటించారని, కానీ  ఇప్పటికీ చాలామంది సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని ఒక విధంగా మందలింపు ధోరణిలో పేర్కొన్నారు. 

మోడీ ట్వీట్‌ వచ్చిన వెంటనే కేంద్ర హౌం శాఖ తీవ్రంగా స్పందించింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సులను ఆపివేశారు. పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ను విధించారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సోమవారం ఉదయం ప్రజలు చాలా చోట్ల రోడ్లపైకి వచ్చేశారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు పెద్దఎత్తున చేరుకున్నారు. అత్యవసరం కోసం వచ్చేవారు కొందరైతే ఎలా ఉందో చూద్దామని వచ్చే యువకులు  ఉన్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనం చేరడం, అదే సమయంలో కేంద్రం కూడా తీవ్రంగా హెచ్చరించడంతో  తరువాత పోలీసులు అప్రమత్తమై రోడ్లపై తిరుగుతున్న వాహనాలను నియంత్రించారు. 

లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. మంగళవారం నుండి ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల నుండి తొమ్మిది గంటల వరకూ మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు కిరాణా షాపులు, రైతుబజార్లకు అవకాశం కల్పించారు. రాత్రి ఏడుగంటల నుండి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. 

ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఎటిఎం వాహనాలకు అనుమతిచ్చారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడుగంటల వరకూ హోటళ్లలో టేక్‌అవేకి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇరుకుగా ఉన్న రైతు బజార్లను విశాల ప్రాంతాలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, పట్టణాల్లో ఈ తరహా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 

నిత్యావసర వస్తువుల  ధరలు నిర్ణ యించి పరిశీలించే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. పొలాల్లో పనులు చేసుకునేవారికి మినహాయింపు ఇచ్చినా గుంపులుగా ఉండొద్దని అన్ని మండల తహశీల్దార్లు ఆదేశాలిచ్చారు. విజయవాడలో ఆటోల కట్టడికోసం రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆటో రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించడంతో ఎక్కడికక్కడ నిలిపేశారు. 

రొయ్యలు, చేపల రవాణాకు ఇబ్బందులు కలిగించొద్దని ప్రభుత్వం కోరింది. బ్యాంకులు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేయనున్నాయి. కొత్త ఎకౌంట్లు, రుణాల మంజూరు వంటి కార్యకలాపాలన్నీ నిలిపేశాయి. సగం మంది సిబ్బందితో నిర్వహించాలని బ్యాంకర్ల అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. 

అన్ని ఎటిఎంలలో సరిపోయినంత డబ్బు ఉంచి, ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించింది. మంగళవారం నుండి మీ సేవ కేంద్రాలు నిలిపివేస్తారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి లాక్‌డౌన్‌ వేతనం చెల్లించనున్నారు. 

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలీసు స్టేషన్ల వారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, పదే పదే తిరిగే వాహనాలను గుర్తించి సీజ్‌ చేస్తామని డిజిపి గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అత్యవసర వస్తు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతిస్తారని, సీజ్‌ చేసిన వాహనాలను వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత మాత్రమే ఇస్తామని చెప్పారు. పోలీసుస్టేషన్ల వారీగా ఈ చెకింగ్‌ ఉంటుందని వివరించారు. ప్రభుత్వ నిబంధనల విషయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.