సిబిఐకి రాజధాని భూముల వ్యవహారం

అమరావతి రాజధాని భూముల వ్యవహారం లో అవకతవకలపై విచారించేందుకు దర్యాప్తును సిబిఐకి అప్పజెబుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్య దర్శి కుమార్‌ విశ్వజిత్‌ జిఒ 46ను జారీచేశారు. 

గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, ఎస్‌సి, ఎస్‌టిలను బెది రించి భూములు కొనుగోళ్లు చేశారంటూ ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే నమోదైన కేసుల వివరా లను సిబిఐకి పంపింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.  

అయితే, అమరావతి భూములలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడినదని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులతో పాటు అధికార పక్షానికి చెందిన పలువురు, వారి సహచరులు సహితం పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేతగా విమర్శలు కురిపించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ విషయమై ముందడుగు వేయలేక పోయారు. 

ఈ ఆరోపణలపై సిఐడి, మంత్రి వర్గ ఉపసంఘంలతో దర్యాప్తులు జరిపించారు. తాజాగా, డిఐజి రఘురాంరెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి, దానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు. అయినా పది నెలలు అవుతున్న నిర్దుష్టంగా ఒక్క కేసు కూడా నమోదు చేయలేక పోయారు. దానితో దిక్కుతోచని పరిస్థితులలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు కనిపిస్తున్నది.