ఏపీలో 7కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7కు చేరినట్లు  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటెన్ విడుదల చేసింది. సోమవారం విశాఖపట్నంలో మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. 

ఇప్పటివరకు ఏపీలో  ప్రకాశం, నెల్లూరు, విజయవాడ, కాకినాడలో ఒక్కో బాధితుడు, విశాఖలో ముగ్గురు కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపింది. ఏపీలో మొదటి కరోనా బాధితుడు పూర్తిగా కొలుకున్నాడని, నెల్లూరు ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది. 

181 కరోనా అనుమానిత కేసుల్లో నమూనాలను తిరుపతి రుయా వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించగా 166 మందికి నెగెటివ్ వచ్చిందని తెలిపింది. మరో 8 మంది రిజల్ట్స్ రావాల్సి ఉందని తెలిపింది.

ఫారిన్ నుంచి ఏపీకి 13,301 మంది ప్రయాణికుల వచ్చారని ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వీరిలో 2,228 మందికి 28 రోజుల క్వారంటైన్ ​ముగిసిందని పేర్కొన్నారు. 

మిగిలిన 11,026 మంది ఇళ్లల్లో క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు. 53 మందికి ఆయా జిల్లాల్లోని ఐసొలేషన్​వార్డుల్లో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు.

కాగా, రాష్ట్రంలో తొలి కరోనా రోగి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న నెల్లూరు యువకుడు ఈ నెల 6వ తేదీ విమానంలో చెన్నై వచ్చాడు. అక్కడి నుంచి కారులో నెల్లుూరు చేరుకున్నాడు. 

అయితే 9వ తేదీన అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా.. కరోనా ఉన్నట్లు తేలింది. 14 రోజుల పాటు చికిత్స అందించారు.

చికిత్స తర్వాత మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో అతడిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ యువకుడ్ని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి.. డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత కూడా మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.