50 దేశాలు లాక్‌డౌన్.. ఇండ్ల వద్దనే 170 కోట్ల మంది 

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా 50 దేశాలు లాక్‌‌డౌన్‌‌ ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లోని సుమారు 170 కోట్ల మందికి పైగా జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ఫ్రాన్స్‌‌, ఇటలీ, అర్జెంటినా, అమెరికా, కాలిఫోర్నియా, ఇరాక్‌‌, రువాండా దేశాలు లాక్‌‌డౌన్‌‌ ఆంక్షలు విధించగా మరికొన్ని దేశాలు ఇండ్లల్లోనే ఉండాలని సూచించాయి. 

174 దేశాల్లో సోమవారం నాటికి 15,873 మంది మృతి చెందారు. 3,50,142 మందికి వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.   తాజాగా మరణాల్లో చైనా కంటే ముందు ఇటలీ ఉన్నది.

ఆ దేశంలో సోమవారం నాటికి 6,077 మంది మృత్యువాత పడగా, 63,927 మందికి సోకింది. చైనాలో స్థానికంగా కేసులు నమోదు కావడం నిలిచిపోయింది. కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్‌ సోకింది. స్పెయిన్‌లో 2,207 మంది, ఇరాన్‌లో 1,812, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 501 మంది మరణించారు. 

సోమవారం ఉదయం నుంచి గ్రీస్‌‌ కర్ఫ్యూ విధించగా కొలంబియా మంగళవారం, న్యూజిలాండ్‌‌ బుధవారం దేశాలను మూసేస్తున్నట్టు వెల్లడించాయి. వీకెండ్‌‌ కావడంతో బ్రిటన్‌‌లో బీచ్‌‌లు, పార్కుల్లో జనం గుమికూడారు. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్‌‌ అయింది. మరోసారి ఇలా జరిగితే కఠినమైన ఆంక్షలుంటాయంది. 

బ్రిటన్‌‌లోని రైల్వే సర్వీసును అక్కడి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. రైల్వే సర్వీసును జనానికి అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

ప్రజలు ఇండ్లల్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నా మాట వినకపోతుండడంతో ఇటలీలోని మేయర్లు సీరియస్​ అవుతున్నారు. ‘చెబితే మీకు అర్థం కాదా’ అంటూ మండిపడుతున్నారు. 

ఉత్తర ఇటలీలోని బారి ఇన్‌‌చార్జ్‌‌ అయిన ఆంటోనియో డెకారో పార్కుల్లో ఉన్న జనాన్ని ఇండ్లల్లోకి వెళ్లాలని చెబుతున్న వీడియో వైరలైంది. ‘ఎట్ల చెబితే మీకు అర్థమైతది. ఎలా పలకాలి. ఇండ్లల్లోనే ఉండండి’ అని ఆయన అన్నారు. జనం ఇండ్లల్లోనే ఉండాలని గట్టిగా అరుస్తూ డెలియా మేయర్‌‌ గియాన్‌‌ఫిలిపో చెప్పారు.