ఒలింపిక్స్‌ వాయిదా ... రద్దు ప్రసక్తి లేదు

కరోనా సమస్య తీవ్రతరం కావడంతో అవసరమైతే ఒలింపిక్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు గాని మొత్తం మీద పోటీల రద్దు జరిగే ప్రసక్తి లేదని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య తేల్చి చెప్పింది.  కరోనా తీవ్రం రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడల నుండి పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించాయి. 

ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ తదితర దేశాలు కూడా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య కూడా క్రీడలను వాయిదా వేయాలని భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 

ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ప్రశ్నార్థకంగా మాడడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. విశ్వ క్రీడలకు కోసం క్రీడాకారులు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి స్థితిలో క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ జరిగితే క్రీడాకారులకు కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి.

ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాలు తమ అథ్లెట్లను టోక్యో ఒలింపిక్స్‌కు పంపేది లేదని స్పష్టం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ ప్రధాని షింజో అబె కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్‌ను నిర్వహించాలని భావించామని, అయితే క్రీడల కంటే పోటీల్లో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. 

ఇలాంటి స్థితిలో పోటీలను వాయిదా వేయాల వద్దా అనే దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్రీడాకారుల ప్రాణాలను పనంగా పెట్టి పోటీలను నిర్వహించాలనేది తమ ఉద్దేశం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో సభ్య దేశాలు, ఒలింపిక్స్ సమాఖ్యతో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.