17 రాష్ట్రాల దిగ్బంధనం ... లోక్‌స‌భ‌  వాయిదా  

కరోనా వైరస్ నేపథ్యంలో దేశం అంతటా అలజడి రేగడం, దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు స్వీయ దిగ్బంధనంలో ఉండడంతో లోక్ సభ సమావేశాలు గడువుకన్నా 12 రోజుల ముందే నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 

మరోవంక 17 రాష్ట్రాలలో పూర్తి స్వీయ దిగ్బంధనం అమలు పరుస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, పంజాబ్, పుడిచేరి రాష్ట్రాలలో పూర్తి కర్ఫ్యూను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. 

పలు రాష్ట్రాల నుండి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా స్వదేశీ విమాన సర్వీస్ లను సహితం బుధవారం నుండి పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దిగ్బంధన సమయంలో తమ ఉద్యోగుల జీతాలు కత్తిరించడం గాని, లేఔట్ ప్రకటించడం గాని చేయవద్దని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్‌ 3వ తేది వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది.  

వాయిదాకు ముందు లోక్‌స‌భ ఎలాంటి చ‌ర్చ లేకుండానే కీలకమైన 2020 సంవ‌త్సరానికి సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించింది. మ‌రో రెండు బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, టిఎంసి, డిఎంకే, శివసేన వంటి పార్టీలు తమ ఎంపిలను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావద్దని ఆదేశించాయి.