సాం 7 నుంచి ఉ 6 వరకు బైటకు రావొద్దు

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో పౌరులు ఎవ్వరు రోడ్లపైకి రాకుండా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. ముఖ్యంగా  ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ భయటకు రావొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ కర్ఫ్యూ సమయాన్ని పెంచుతామని చెప్పారు. 

ప్రజలు రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని స్పష్టం చేసారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతిస్తామని చెబుతూ ఎపిడమిక్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రకటించారు. 

రోడ్లపై ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు అన్నింటిని మూసివేశామని, అన్నీ విద్యాసంస్థలు, షాపులు, అన్నీ బంద్ చేశామని వివరించారు.  అయితే గ్రామాల్లో ఉపాధి పనులు చేసుకోవచ్చని, అలాగే రైతులు వ్యవసాయ పనులు చేసుకోవచ్చని సూచించారు. 

కాగా, విదేశస్థులు ఎవరు బయటకు రావొద్దని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి పాస్ పోర్టుపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. 

మార్చి 31 వరకు లాక్ డౌన్ రూల్స్ కఠినంగా అమలు చేయాలని పోలీసులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  ఏ వాహానానికీ తిరిగే పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.  లాక్ డౌన్ అమలుపై పోలీసుశాఖ కఠినంగా ఉంటుందని, ప్రజలు ఒక్కొక్కరుగా రోడ్లమీదకు వస్తుంటే సమస్య మొదటికి వస్తుందని తెలిపారు.   

ఇలా ఉండగా, తెలంగాణలో కరోనా కేసులు 30కి చేరాయి. ఈ రోజు ఒక్కరోజే కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా బృందంతో తిరిగిన కరీంనగర్ వ్యక్తికి, ఫ్రాన్స్ నుంచి వచ్చిన హైదరాబాద్ వాసికి, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది.